రేవంత్ రెడ్డి దైవ ద్రోహానికి పాల్పడ్డాడని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆగస్ట్ 15లోపు రుణమాఫీ చేస్తానంటూ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి మోసం చేశాడని..గడువు ముగిసినా హామీని నెరవేర్చలేదని దాంతో ఆ పాపం రాష్ట్రానికి చుట్టుకోకుండా దేవుళ్ల దగ్గరకు తామే వెళ్తామన్నారు.
అన్ని మతాలకు చెందిన దేవుళ్లపై రేవంత్ రెడ్డి ఒట్టు వేశాడని అందుకు సంబంధించిన వీడియోను ప్రదర్శించిన హరీష్ రావు..రేవంత్ మోసం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారకుండా ఉండేలా అన్ని దేవాలయాలు, మజీదులు , చర్చిలకు వెళ్తామని చెప్పారు. రైతు రుణమాఫీ జరగలేదని వేలాదిగా బీఆర్ఎస్ ఆఫీసుకు ఫిర్యాదులు వచ్చాయని, రుణమాఫీ సంపూర్ణంగా జరిగినట్లుగా నిరూపిస్తే రాజీనామా చేస్తానని మరోసారి సవాల్ చేశారు.
రుణమాఫీ పూర్తి అయినట్లు రేవంత్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి టాప్..మోసగించడంలో తోపు అంటూ విమర్శించారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పదవికి కళంకం తెచ్చేలా ఉన్నాయని.. ఇప్పటికైనా రేవంత్ భాష తీరును మార్చుకోవాలని హితవు పలికారు.