క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ పై తొలి నుంచి అందరి ద్రుష్టి పడింది. అర్జున్ చిన్నప్పటినుంచి క్రికెట్ ప్రపంచానికి తెలుసు. తండ్రి బాటలోనే తను కూడా క్రికెట్ ఆటనే కెరీర్ గా చేసుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో ఆస్ట్రేలియాలో శిక్షణ తీసుకున్నాడు. రంజీలు ఆడాడు. ఐపీఎల్ లో ఆరంగేట్రం చేశాడు. కానీ ఇప్పటి వరకూ అర్జున్ నుంచి ఒక్క ఇన్నింగ్ గుర్తుపెట్టుకునేలా లేదు.
ఐపీఎల్ లో ముంబై తరపున ఆడుతున్నాడు అర్జున్. కానీ ఈ సీజన్ లో ఫైనల్ జట్టులో చోటు దక్కలేదు. శుక్రవారం ఎలాంటి ప్రాధాన్యత లేని మ్యాచ్ లో అర్జున్ కి అవకాశం వచ్చింది. రెండు ఓవర్లు బాగానే బౌల్ చేశాడు. కానీ మూడో ఓవర్ కి వచ్చేసరికి తేలిపోయాడు. క్రాంప్స్ తో ఇబ్బంది పడ్డాడు. అయితే వెంటనే మెడికల్ సాయం తీసుకున్నాడు. తర్వాత అర్జున్ వేసిన తొలి రెండు బంతులకు రెండు భారీ సిక్సర్లు కొట్టాడు నికలస్ పూరన్. అతని ఊపు చుస్తే మరో నాలుగు బంతుల్లో నాలుగు సిక్సులు కొట్టేస్తాడెమో అనుకున్నారంతా. బహుశా ఈ సెన్స్ అర్జున్ కి తట్టిందేమో. అందుకే పెద్ద కారణం లేకుండానే బౌలింగ్ మధ్యలో ఆపేసి రిటైర్డ్ హార్ట్ గా గ్రౌండ్ ని విడిచిపెట్టి డగౌట్ కి వెళ్ళిపోయాడు.
దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అర్జున్ ఒత్తిడికి గురౌతున్నాడని కొందరు అంటే.. ఇలా భయపడితే ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడేది ఎలా? అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అర్జున్ ఐపిఎల్ ట్రాక్ రికార్డ్ బాలేదు. సచిన్, అంబాని మధ్య స్నేహం కారణంగా అతడు ఫ్రాంచైజ్ లో వున్నాడు కానీ ఒక జట్టు కొనుగోలు చేసేటంత ఆటని అర్జున్ ఎప్పుడూ ప్రదర్శించలేదు. పైగా ఒక ఓవర్ లో 31 పరుగులు ఇచ్చిన చెత్త రికార్డ్ గతంలో అర్జున్ పేరిట వుంది. నిన్నటి మ్యాచ్ లో కూడా ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టే ప్రమాదం గ్రహించే మైదానం విడిచాడని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
అర్జున్ వయసు 24. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం ఇది చిన్న వయసేం కాదు.. ఇప్పటికే ఆ వయసులోని శుభమ్ గిల్, పృద్వీ షా లాంటి ఆటగాళ్ళు నిలబడిపోయారు. గుర్తుపెట్టుకునే ఇన్నింగ్స్ ఆడుతున్నారు. 23 ఏళ్ళ అభిషేక్ శర్మ ఈ సీజన్ లో ట్రావిస్ హెడ్ ని డామినేట్ చేసే ఆట తీరు కనబరుస్తున్నాడు. అర్జున్ మాత్రం ఈ వేగాన్ని అందుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. వారసులపై ఖచ్చితంగా ఒత్తిడి వుంటుంది. అయితే ఆ ఒత్తిడి దాటుకొని మంచి ఆట తీరు కనబరచాలి. ఈ విషయంలో అర్జున్ ఆటపై మరింత ద్రుష్టి పెట్టాల్సిన అవసరం వుంది.