తెలుగుదేశం పార్టీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలోనే సంప్రదాయేతర విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేలా 6600 మెగావాట్లకు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. అంటే వారు ఇక్కడే పెట్టుబడులు పెడతారు. ఇక్కడే జీఎస్టీ కడతారు. దాని వల్ల ముఫ్పై నుంచి నలభై శాతం పెట్టుబడి వ్యయంలో పన్ను రూపంలో ప్రభుత్వానికి వస్తుంది. అంటే రూ. పది వేల కోట్లు పెట్టుబడి పెడితే నాలుగు వేల కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. ఉద్యోగాలు లభిస్తాయి. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. బుద్ది ఉన్న వాడు ఎవడైనా పాతికేళ్లకు ఒప్పందాలు చేసుకుంటారా అని జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు. అవినీతి జరిగిందని.. గ్రిడ్ సామర్థ్యం లేదని ఆ ఒప్పందాలు రద్దు చేసుకున్నారు. అవినీతిని నిరూపించలేకపోయారు. ఆ ఒప్పందాలు ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నాయి.
అయితే అప్పుడు సంప్రదాయేతర విద్యుత్ విషయంలో అన్ని మాటలు చెప్పిన వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ ఇప్పుడు ఏకంగా 9వేల మెగా వాట్లను కొనేందుకు ఒప్పందాలు చేసుకునేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఇప్పుడు టీడీపీ ప్రశ్నిస్తోంది. అప్పుడు లేని గ్రిడ్ సామర్థ్యం ఇప్పుడు ఎలా వచ్చిందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. గత రెండేళ్లలో రూపాయి పెట్టుబడి పెట్టలేదని గుర్తు చేశారు.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ పేరుతో అదానీ సంస్థకు ఏపీ సర్కార్ కొన్ని వేల కోట్లు కట్టబెట్టడానికి గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు మేలు చేయడానికి ఈ పనులు చేస్తోందని పయ్యావుల ఆరోపిస్తున్నారు. పేరుకు సెకీ అయినా ఆ ఒప్పందం అంతా అదానీ కంపెనీకి వెళ్తుంది. దేశంలో భారీగా సౌర విద్యుత్ ఉత్పత్తికి సెకీ 2019 జూన్‌లో టెండర్లు పిలిచింది. ఆ టెండర్లలో అదానీ పవర్ విజేతగా నిలిచింది. ఇప్పుడు సెకీ పేరుతో అదానీ కంపెనీనే ఏపీకి విద్యుత్ సప్లై చేస్తుంది. ప్రభుత్వం పయ్యావుల ఆరోపణలకు వివరణ నోట్ విడుదల చేసింది. కానీ అందులో పయ్యావుల ప్రశ్నించిన వాటికి సరైన సమధానాల్లేవు. ఏపీలో ఎందుకు ప్లాంట్లు పెట్టడం లేదంటే… కరెంట్‌ను ఏపీలో ఉత్పత్తి చేసినా పక్క రాష్ట్రాలకు పంపి మళ్లీ ఏపీకి తేవాల్సి ఉంటుందని వాదించారు.
మొత్తానికి తాము గతంలో ఏది అయితే తప్పు అని వాదించామో ఇప్పుడు అంత కంటే ఎక్కువగా ప్రభుత్వం చేస్తోంది. దీన్ని సమర్థించుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ఈ విద్యుత్ఒప్పందాలపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఏర్పడుతున్నాయి. రాష్ట్రానికి అన్ని విధాలుగా తీరని అన్యాయం చేస్తున్నారన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నాయి.