సోము వీర్రాజుకు కేటీఆర్ పై కోపం వచ్చింది. సిరిసిల్లలో జరిగి సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ ఘోరపరాజయయం పాలైంది. దీనిపై కేటీఆర్ మీడియాతో మాట్లాడినప్పుడు.. తెలంగాణలో బీజేపీకి అసలు స్థానం లేదని తేలిపోయిందని కామెంట్లు చేశారు. ఇది సోము వీర్రాజు చూశారు. అయితే కేటీఆర్ మన రాష్ట్రం కాదు కదా అని ఆయన ఊరుకోలేదు. ఎక్కడైనా సరే బీజేపీని అన్నారు కదా అని మైక్ దొరకగానే రెచ్చిపోయారు.
గుంటూరులో .. జగన్ సర్కార్ ఎస్సీ పథకాలు రద్దు చేసిందని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న సోము వీర్రాజు ప్రసంగించారు. సీఎం జగన్ పై విమర్శలు చేశారు కానీ.. ఈ మ్యాటర్ లోకి కేటీఆర్ ను తీసుకొచ్చేసారు. కేటీఆర్ మాట్లాడితే అచ్చం కేసీఆర్ మాట్లాడినట్టే ఉందన్నారు. ఈ ఫ్యామిలీ పార్టీలు అన్ని అబద్దాలు మాట్లాడటమేనని విమర్శించారు. కూతురు, కొడుకు ఇలా అందరు అబద్దాలు మాట్లాడటమేనని.. ఈ బయట మాట్లాడే వారి నాతో కూర్చో బెడితే కడిగిపాడేస్తానని హెచ్చరించారు. తనతో చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. కేటీఆర్ ది నోరా తాటిమట్టా అని మండిపడ్డారు. తనతో కూర్చుంటే కేటీఆర్ ను వాయించి పడేస్తానన్నారు.
వీర్రాజు ఆవేశం చూసి ఆ పార్టీ నేతలు కూడా తలగోక్కుకున్నారు. ఇంత అర్జెంట్ గా కేటీఆర్, కేసీఆర్ లపై విరుచుకుపడాల్సిన అవసరం ఏమిటో వారికి అర్థం కాలేదు. తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ ఏమైనా మాట్లాడితే కౌంటర్ ఇచ్చుకోవడానికి అక్కడి బీజేపీ నేతలున్నారు. అయినా ఇక్కడ సోమువీర్రాజు ఆవేశపడటం ఏమిటో.. ఇచ్చి పడేస్తా.. వాయించి పడేస్తానని రెచ్చిపోవడం ఏమిటో.. బీజేపీ నేతలకు అర్థం కాలేదు. సోము వీర్రాజు అంటే అంతే అనుకోవాలని సరి పెట్టుకున్నారు.