జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ఆయనతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామని బాధపడ్డారు. అంతే కాకుండా నారాయణ తనదైన లాంగ్వేజ్‌లో విమర్శలు చేశారు. దీనికి జనసేన నేతలెవరూ స్పందించలేదు. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు మాత్రం పట్టరానంత కోపం వచ్చింది. సీపీఐ నారాయణపై విరుచుకుపడ్డారు. అసలు సీపీఐ పొత్తు పెట్టుకోని పార్టీ ఉందా అంటూ… వీరావేశం ప్రదర్శించారు. అందులో పవన్ కల్యాణ్ నిబద్ధతను కూడా వివరించారు. పవన్ కల్యాణ్ తమ కొత్త మిత్రుడు కాబట్టి.. సోము వీర్రాజు అలా స్పందించి ఉండవచ్చు…కానీ.. తమ పార్టీకే చెందిన వారిని వైసీపీ నేతలు తూలనాడుతున్నా కనీసం స్పందించకపోవడంతోనే ఇక్కడ సమస్య వస్తోంది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన పురందేశ్వరిని వైసీపీ నేతలు నానా మాటలన్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి అయితే ఆమెకు కులం అంటగట్టి… ఎవరూ చేయనన్ని విమర్శలు చేశారు. కానీ వాటికి ఏపీ బీజేపీ నుంచి స్పందన లేకుండా పోయింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా.. తమ పార్టీలో జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగిన పురందేశ్వరిపై అంత దారుణమైన విమర్శలు చేసినా సోము వీర్రాజుకు ఏమీ పట్టలేదు. అదే పవన్ కల్యాణ్ ను .. కమ్యూనిస్టు పార్టీ నేత విమర్శించేసరిగా.. ఆగ్రహం పట్టలేక విమర్శలకు దిగిపోయారు. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉండి కూడా… కొంత మంది విషయంలోనే ప్రత్యేకమైన ఆసక్తి చూపడం… తనకు ఇష్టం లేని నేతల పట్ల… ప్రభుత్వంపై విరుచుకుపడే నేతల పట్ల నిర్లక్ష్య భావంతో ఉండటం పార్టీలో గ్రూపులకు కారణం అవుతోంది.
ఇప్పటికే బీజేపీ ప్రో వైసీపీ.. యాంటీ వైసీపీ అనే రెండు గ్రూపులున్నాయని చెబుతున్నారు. సోము వీర్రాజు.. అంతా యాంటీ వైసీపీనే అని నిరూపించి… తామే వైసీపీకి ప్రత్యామ్నాయం అని చెప్పాల్సి ఉంది. కానీ ఆయన చర్యలు … చేస్తున్న ప్రకటనలు … అన్నీ బీజేపీని మరో విధంగా ప్రజల ముందు ప్రజెంట్ చేస్తున్నాయి. ఇది బీజేపీ భవిష్యత్‌కు మంచిది కాదన్న అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది.