ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ వున్నారు. కానీ, ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ అరుదుగా ప్రేక్షకుల ముందుకు వస్తారు. ‘కథానాయకుడు’లో రజినీకాంత్, ‘అతడు’లో నాజర్… బాలు ఎవరికైనా గొంతు అరువు ఇస్తే ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఆయన వాయిస్ అంత ఐకానిక్ మరి. కొన్నాళ్ళుగా డబ్బింగ్‌కి దూరంగా వున్న ఈ గాయకుడు తాజాగా ఒకరికి గొంతు అరువిచ్చారు. తమిళ హీరో కార్తీ నటించిన తాజా సినిమా ‘కడైకుట్టి సింగమ్’. తెలుగులో ‘చినబాబు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో కట్టప్ప సత్యరాజ్ హీరో తండ్రి పాత్రలో నటించారు. ఆయనకు బాలు తెలుగు డబ్బింగ్ చెప్పారు. దర్శక నిర్మాతలు ఆయన్ను ఎలా ఒప్పించారో మరి? సత్యరాజ్ పాత్ర బాలుకి బాగా నచ్చి వుంటుంది. మిగతా విషయాలకు వస్తే… ప్రతి ఏడాది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరుతో అందించే జాతీయ పురస్కారాన్ని ఈ ఏడాది ఎస్. జానకికి అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం నెల్లూరులో జరగనుంది.