ఓ మహానటుడి లెగస్సీ నెత్తిమీద ఉంచుకొని, నట వారసుడిగా చిత్రసీమలో అడుగుపెట్టి, అభిమానుల అంచనాల్ని తట్టుకొంటూ, ప్రేక్షకుల్ని మెప్పించేలా ప్రయాణం చేయడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ భారం నందమూరి బాలకృష్ణ మోశారు. ఆ అంచనాల్ని తట్టుకొన్నారు. నందమూరి అభిమానుల్ని మెప్పిస్తూనే తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథాని సృష్టించుకొన్నారు. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా యాభై ఏళ్ల పాటు నిర్విరామంగా చిత్రసీమని అలరిస్తూనే ఉన్నారు. ఇది అపూర్వమైన ప్రయాణం. అనితర సాధ్యమైన ప్రభంజనం. మరో వందేళ్లు గుర్తు పెట్టుకొనే చారిత్రక ఘట్టం.
మహా వృక్షం నీడన చిన్న మొక్కైనా భూమిని చీల్చుకొంటూ మొలకెత్తడం సామాన్యమైన విషయం కాదు. సొంత పంథా కావాలి. తనలో ఏదో ప్రత్యేకత ఉండాలి. నందమూరి తారక రామారావుని ఇలవేల్పులా ఆరాధించిన తెలుగు ప్రజానీకం. ఆయన వారసుడ్ని అంతకంటే ఎత్తులో చూడాలనుకొంటుంది. ఎన్టీఆర్ పౌరాణికాలు చేశారు. జానపదాల్లో మెరిశారు. సోషల్ కథల గురించి ఇహ చెప్పక్కర్లెద్దు. చారిత్రక పాత్రలెన్నో ఆయన ముందు మోకరిల్లాయి. ఇంతకంటే బాలయ్య ఏం చేయగలడు? అంతకంటే ఏం మెప్పించగలడు? అనేదే అందరి ప్రశ్న. వాటిని మెల్లమెల్లగా పటాపంచలు చేసుకొంటూ వెళ్లాడు బాలయ్య. తొలి అడుగుల్లో కమర్షియల్ కథలపైనే మొగ్గు చూపినా, ఆ తరవాత క్రమక్రమంగా విశ్వరూపం చూపించుకొంటూ ముందుకు వెళ్లాడు.
డైలాగ్ చెబితే బాలయ్యే చెప్పాలి.. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన నిజం. ఆ డిక్షన్ ఇంకెవ్వరికీ అందలేదు. భాషపై మమకారం ఉంటే తప్ప సాధ్యం కాని విషయం అది. తను మాస్ డైలాగ్ చెబితే – క్లాస్ కూడా మాస్ అయిపోతుంది. పద్యాలు వల్లిస్తే మాస్ కూడా చెవులు అప్పగించేస్తుంది. ఇప్పటి హీరోల్లో పౌరాణిక పాత్రలు చేసే ధైర్యం ఒక్క బాలకృష్ణకే ఉందన్నది ఏ హీరో అభిమానైనా అంగీకరించి తీరాల్సిందే. ఎన్టీఆర్‌కి అందనిది… బాలయ్య చేసిందీ ఏమైనా ఉందంటే.. అది సైన్స్ ఫిక్షన్. ఆదిత్య 369తో ఆ ఫీట్ చేసేశారు బాలయ్య. ఈ విషయంలో మాత్రం ఆయన తండ్రిని మించిన తనయుడే!
ఓసారి కథ ఒప్పుకొంటే – దర్శకుడి విషయంలో వేలు పెట్టని ప్రొఫెషనలిజం బాలయ్యకే సొంతం. ఓ సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడ్ని నిందించడం, హిట్ అయితే ఆ క్రిడిట్ అంతా తానే తీసుకోవడం బాలయ్య కెరీర్లో ఎప్పుడూ జరగలేదు. బాలయ్య అంత భోళా మనిషి ఇంకెక్కడా కనిపించడు కూడా. ఆ లక్షణంతోనే తన అభిమానగణాన్ని మరింత పెంచుకొంటూ వెళ్లారు. `అన్ స్టాపబుల్` షోలో కనిపించిన బాలయ్య వ్యక్తిత్వం, మాటకారితనం ఆయనపై ప్రేమని మరింత పెంచేశాయి. ఇది ఆయనలో కనిపించిన మరో యాంగిల్.
సినిమాలు పక్కన పెడితే – రాజకీయాలు, సేవారంగంలోనూ బాలయ్య వేసిన ముద్ర ప్రత్యేకమైనది. ప్రతికూల పరిస్థితుల్లోనూ హిందూపురం నుంచి గెలిచి, పొలిటికల్‌గా తన స్టామినా చూపించారు. బసవతారకం ఆసుపత్రి ద్వారా ఆయన చేస్తున్న సేవలు మర్చిపోలేనివి. ఈ వయసులోనూ యువ కథానాయకులతో పోటీ పడుతూ, జోరుగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు తన నట వారసుడ్ని వెండి తెరకు పరిచయం చేస్తున్నారు. మోక్షజ్ఞ కోసం ఓ కథ సిద్ధమైంది. అందులో బాలయ్య కూడా నటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే నందమూరి అభిమానులకు అది డబుల్ బొనాంజానే. ఆదివారం బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాద్ లో అట్టహాసంగా జరగబోతున్నాయి. తెలుగు చిత్రసీమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. ఈ వేడుక… బాలయ్య సినీ జీవితానికి మరపురాని కానుకగా మిగిలిపోవాలని, మరింత కాలం జై బాలయ్య అంటూ అభిమానులంతా ఈ నట ప్రయాణాన్ని ఆస్వాదించాలని తెలుగు 360 కోరుకొంటోంది.
(బాలకృష్ణ నట ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా)