వాడకుండా పోతే ఎంత పెద్ద యంత్రమైనా తుప్పుబట్టిపోతుంది. భాష కూడా అంతే. కొత్త పదాలు పుట్టించకపోయినా ఫర్వాలేదు. ఉన్న భాషని వాడుతూ ఉండాలి. భాషంటే మాటలో, పదాల సముదాయమో కాదు. భాషంటే సంప్రదాయం. సంస్క్రతి. భాషని వాడుకలోకి తీసుకుని రావాల్సిన బాధ్యత సినిమావాళ్లపై కూడా ఉంది. ఎందుకంటే… సినిమా అనేది తెలుగువాళ్లకు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు. అదో జీవన విధానం అయిపోయింది. సినిమాలు జనాల్లో మార్పు తీసుకొస్తాయి. ఆలోచింపజేస్తాయి. అంతటి కీలకమైన పాత్ర పోషించే సినిమా.. భాష విషయంలో ఎన్నో అచ్చుతప్పులకు పాల్పడుతోంది. ఇది క్షమించరాని నేరం.
సినిమా పేర్లే తీసుకోండి. అంతటా ఇంగ్లీషు వాసనే. గాడ్ ఫాదర్, ఘోస్ట్, వారియర్, సార్, మిస్టర్ ప్రెగ్నెంట్ హంట్… ఇలా ప్రతీ నాలుగు సినిమాల్లోనూ ఓ ఇంగ్లీష్ పేరు కనిపిస్తుంది. ఈ జాడ్యం ఇప్పటిది కాదు. ముందు నుంచీ.. ఉన్నదే. ఇప్పుడు మరింత ఎక్కువైంది. పాన్ ఇండియా అనే మత్తులో.. సినిమా పేరు అన్నిచోట్లా ఒకేలా వినిపించాలి, కనిపించాలి అనే ఉద్దేశంతో… ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సినిమా పేర్లోనే కాదు. పాటల్లోనూ, మాటల్లోనూ పరభాషా పదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ట్రెండీ పదాల పేరిట పాట మొత్తం పర భాషనే వాడేస్తున్నారు. ఖర్మకాలి అవి హిట్లు కూడా అయిపోతున్నాయి.
పాటలే కాదు. స్టేజీ ఎక్కితే వాళ్ల మాట తీరూ అంతే. ఎక్కడి నుంచో, పరభాష నుంచి వచ్చిన నటీనటులు వచ్చీ రానీ తెలుగుతో మెప్పించడానికి తాపత్రయపడుతుంటే, తెలుగు నేలపై పుట్టి, తెలుగువారై ఉండి.. మైకు పట్టుకోగానే అనర్గళంగా ఆంగ్లం దంచి కొట్టడం ఫ్యాషన్ అనుకొంటున్నారు. తెలుగు సినిమాకి తెలుగులోనే పేరు పెట్టాలంటూ అప్పట్లో ఓ నిబంధన ఉండేది. తెలుగులో పేరు పెడితేనే రాయితీ ఇచ్చేవారు. ఇప్పుడు అది లేదు. అయితే ఈ నిబంధనని తమిళనాట ఇప్పటికీ పాటిస్తున్నారు. వాళ్లకు బాషాభిమానం ఎక్కువ. తమిళ సినిమాకి వేరే భాషలో పేరు పెడితే అస్సలు ఊరుకోరు. స్టేజీపై తమిళమే మాట్లాడాలి. లేదంటే గోల గోల చేస్తారు. అలా తమిళ భాషని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ శ్రద్ధ మనకూ రావాలి. లేదంటే.. సినిమాల్లో వాడే వంకర భాషే, అసలు భాషగా చలామణీ అయ్యే ప్రమాదం ఉంది.
(నేడు తెలుగు భాషా దినోత్సవం)