ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. పార్టీ కోసం పని చేసిన నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ పదవుల పంపకం చేపట్టేందుకు కూటమి పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి, పార్టీ జెండాలు మోసిన వారికి గుర్తింపు దక్కనుంది.
కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతకు పదవులు దక్కనున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట 60శాతం టీడీపీకి, 30శాతం జనసేనకు, 10శాతం పదవులు బీజేపీకి దక్కబోతున్నాయి. ఇక జనసేన ఎమ్మెల్యేలున్న చోట 60శాతం నామినేటెడ్ పోస్టులు జనసేన పార్టీకి, టీడీపీకి 30శాతం, బీజేపీకి 10శాతం పదవులు చెందుతాయి. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఉన్న దగ్గర 50శాతం ఆ పార్టీకి, మిగిలిన 50శాతంలో టీడీపీ-జనసేన కలిసి పదవులు పంచుకుంటాయి.
Also Read : ఏపీ రైల్వే బడ్జెట్ 9వేల కోట్లు… ఒక్క అమరావతికే 2వేల కోట్లు!
ఇప్పటికే కీలక నాయకుల పదవులపై స్పష్టత వచ్చినా… అన్ని పార్టీల నుండి తీవ్ర పోటీ ఉన్న దృష్ట్యా ఎక్కువ పదవులను ఒకేసారి ప్రకటించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక్క టీటీడీ బోర్డు చైర్మన్, మెంబర్లకే తీవ్ర పోటీ ఉంది. రాష్ట్రస్థాయి కార్పోరేషన్లకు కూడా పోటీ అంతేస్థాయిలో ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నియోజవర్గాల్లో పదవుల పంపకం ఒక ఎత్తు. ఏమాత్రం తేడా వచ్చినా ఒక్కటిగా ఉన్న కూటమి పార్టీల క్యాడర్ లో చీలిక వచ్చే ప్రమాదం ఉంది. దీంతో నియోజకవర్గాల్లో ఉన్న పదవులను కూడా స్థానికంగా మూడు పార్టీల మధ్య సఖ్యతతో ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో కొంత టైం పట్టే అవకావశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, పదవుల కోసం పార్టీలోకి వస్తున్న వారిని మాత్రం పక్కన పెట్టాలని, వైసీపీపై పోరాడిన నేతలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్న నిర్ణయం మాత్రం అన్ని పార్టీలు నిర్ణయించాయి.