“అర్థమయ్యేటట్లుగా పాటలు రాయడం కాదు.. అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేసేలా స్ఫూర్తి కలిగించేలా పాటలు రాయడమే శాస్త్రిగారి గొప్ప” అని ఓ సందర్భంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సీతారామశాస్త్రి గురించి చెబుతారు. ఆయన పాటల్లోని సాహిత్య విలువలు మొదట్లో ఆ స్థాయిలో ఉండేవి. ఆయన పాటల్లోని వాడే పదాలకు అర్థాలేమిటో తెలుసుకోవాలని శబ్దరత్నాకరాలను కొనుక్కున్న లక్షలాది మంది నాటి యువత నేడు తెలుగును సుసంపన్నం చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా పాట అంటే సాహిత్యమా అని తృణీకరించేస్తారు కానీ.. అతి సీతారామశాస్త్రి విషయంలో మాత్రమే కాదు.
సీతారామశాస్త్రి పాటలు సాహిత్యం కాదు.. అంతకు మించి. మనిషి గురించి అణుఅణువూ పరిశోధించిన మేధావితనం పాటల్లో కనిపిస్తుంది. వాటిని పామరులకు కూడా అర్థమయ్యేలా చెప్పడంలో ఆయన రాటుదేలిపోయారు. ఎక్కడ ఎలాంటి పదాలతో చెప్పాలో అలాంటివే చెబుతారు. విశ్వనాథ్ సినిమాలకు పాటలు అందించాలంటే ఆ స్థాయిలోనే రాస్తారు. కాలం మారే కొద్దీ కొత్త తరం ఎలా చెబితే అర్థం చేసుకుంటుందో అలానే చెబుతూ వస్త్తున్నారు. అందుకే ఆయన కవిశిఖరం.
జగమంత కుటుంబం నాది అని అంటూ ఆయన రాసిన పాట.. ప్రపంచ సత్యం. ప్రపంచంలో ఉండే భువబంధాలు కాదు అసలు జీవితంలో ఏది నిజమో ఆ పాట ద్వారా చెబుతారు. ప్రేమ గీతాలు అయినా దేవుడి పాటలైన… విప్లగీతాలైనా ఆయన కలం నుంచి కొత్త ఒరవడితో వస్తాయి. ముఖ్యంగా ఆయనలో ఓ భావావేశం ఉంటుంది. అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్ర మందామా అని సిగ్గులేని జనాన్ని నిగ్గదీసిన కలం ఆయనది. అదే చేత్తో ఆయన రాసిన ప్రేమ పాటలు ఎన్నో గుర్తు చేసుకునే కొద్దీ గుర్తుకు వస్తాయి.
సినిమాలపై ఓ స్పష్టమైన దృక్పథం ఉన్న దర్శకులతో ఆయనకు తండ్రీ కొడుకుల అనుబంధం ఉంటుంది. విశ్వనాథ్, కృష్ణవంశీ, క్రిష్ ఇలా కొంత మందితో ఆయనకు ఉన్న అనుబంధం పాటలను మించి ఉంటుంది. కొందరికి ఆయన గురువు, కొందరికి మిత్రుడు, కొందరికి దగ్గరైన బంధువు, కొందరికి సాక్షాత్తూ దేవుడు. అందుకే ఆయన అందుకోలేని మేరుశిఖరం.. అంతులేని మహాసముద్రం..!