రెండు తెలుగు రాష్ట్రాల అధినేతలు పోటీపడటంతో కృష్ణా పుష్కరాలు ఆధ్యాత్మికతను మించి అధికార ఈవెంట్లుగా మారాయి. ప్రభుత్వ పీఠాధిపతులు మతైక పీఠాధిపతులుగా మారిన వైనానికి నల్లని కృష్ణమ్మ కూడా తెల్లబోకతప్పలేదు. ప్రజలూ విశ్వాసాలూ వేరు ప్రభుత్వాల ప్రచార లంపటం వేరు. ఏమైతేనేం మరో రెండుమూడు రోజుల్లో పుష్కరాలు ముగిసిపోతున్నాయి. స్నానం వల్ల పుణ్యం కలుగుతుందని ఎంతగా ప్రచారం జరిగినా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మునకలవల్ల ప్రత్యేక హౌదా మాత్రం సిద్ధించింది లేదు. పైగా దాన్ని కృష్ణార్పణం చేసిన కేంద్రం వూరించిన ప్యాకేజికి కూడా దాదాపు పిండ ప్రదానం చేసేసింది. పుష్కరసందడితో సమాంతరంగా ప్రత్యేక ప్రహసనం కూడా జరిగింది . చంద్రబాబు నాయుడుపుష్కరాలకు ఆహ్వానం ఇస్తానంటూ ఢిల్లీ పయనం కట్టారు. నిజానికి ఇందులో భక్తిని మించిన రాజకీయ ఆసక్తి వుందని అందరికీ తెలుసు. ఆయన వెళ్లే సరికి అక్కడ నూతన రాజకీయ క్రీడకు రంగం సిద్ధమైంది. వెళ్లిన క్షణం నుంచి వరుసగా భేటీలు జరుపుతూ చివరకు ప్రధాని మోడీతో కూడా సమావేశమైనారు. ఈ మొత్తం తతంగంలో ఒక్కసారి కూడా నోరు మెదపని మోడీ చంద్రబాబుతో చర్చల తర్వాత కూడా పెదవి విప్పించి లేదు. కాని ఇరుపార్టీల నేతలు మాత్రం ఏదో అవగాహన కుదిరినట్టు రాష్ట్రానికి భారీ ప్యాకేజీ సిద్ధం అవుతన్నట్టు కథలు వదిలారు. పరిణామాలు దగ్గరగా పరిశీలిస్తున్న వారికి ఇదేమీ జరిగేది కాదని ముందే తెలుసు. పైగా ఆ సమయంలో తెలంగాణ పర్యటనకు వస్తూ ఎపికి భారీ గా ప్రకటించడం జరగడని తెలుసు.
అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడే మట్టినీళ్లు ఇచ్చిన మోడీ నుంచి ఎవరూ అలాటిది ఆశించలేదు గాని టిడిపి వర్గాలే కావాలని ఏదో మధనం జరుగుతుందన్న భావన కలిగించాయి. మరోవైపున పార్లమెంటు బయిట నిరసనలు సభలో ప్రస్తావనలూ అంటూ ప్రతిపక్షాలే గాక తాము కూడా ఏదో ఆందోళన చేశామన్న అభిప్రాయం కలిగించేందుకు తంటాలు పడ్డారు ఆ పార్టీ ఎంపిలు. పార్లమెంటు సమావేశాల లోపలే ప్యాకేజీ ప్రకటిస్తారని మొదట చెప్పి తర్వాత మరికొంత వ్యవధి కావాలని సరిపెట్టారు. ు. కేంద్రంలో ఏదో కసరత్తు జరుగుతుందన్న భ్రమ కొనసాగడానికి కారకులైనారు. . ఇంతగా కథను రక్తి కట్టించిన తర్వాత కేంద్రం షరా మామూలుగా అరకొర నిధులు విదిలించి సరిపెట్టింది. ఒక్క రెవెన్యూ లోటు కిందనే 16 వేల కోట్లు ఇవ్వాల్సి వుండగా మొత్తంగా 1976 కోట్లు ఇచ్చి సరిపెట్టింది.ఇందులో రెవెన్యూ లోటు భర్తీకి 1176,నూతన రాజధానికి 450 కోట్లు, వెనక బడిన ప్రాంతాలకు 350 కోట్టు కేటాయించింది. 20 వేల కోట్లు 30 వేల కోట్టు ప్కాకేజీ సిద్దమై పోతుందని కబుర్లు చెప్పిన పాలకపక్షానికి ఇది నిజానికి శృంగభంగం. కాని ఆ తర్వాత జరిగిన మంత్రి వర్గ సమావేశం వివరాలు వెల్లడించిన ముఖ్యమంత్రి మాటల్లో ఆ విధమైన తీవ్ర విమర్శనా స్వరం గాని ఆగ్రహం గాని ధ్వనించకపోగా సన్నాయి నొక్కులతో సరిపోయింది. బిజెపి టిడిపిల మరో మిత్రుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా నేనొక్కణ్ని ఏం చేస్తానంటూ పలాయన మంత్రం పాడేశారు. బిజెపి ప్రతినిధులతో మాట్లాడినప్పుడు ఇంక ఏదో పెద్దగా వస్తుందనే ఆశలు అవసరం లేదని తేల్చేస్తున్నారు.పార్లమెంటు సాక్షిగా ప్రధాని ప్రధాన ప్రతిపక్షం కలిసి ఇచ్చిన హామీకి ఇంతటి దుర్గతి పట్టడం దేశ చరిత్రలోనే అరుదు. మామూలు వాగ్డానాల భంగం పరిపాటి గాని విభజన వంటి చారిత్రిక సమయంలో ఇచ్చిన లిఖిలపూర్వక హామీకే దిక్కులేకుండా చేయడం బిజెపికే చెల్లింది. దాన్ని సహిస్తూ మిత్రపక్షంగా అధికారంలో కొనసాగడం టిడిపి రాజకీయ ప్రయోజనాలకు తప్ప రాష్ట్రానికి కాదని తేలిపోతున్నది.
ఈ సందర్భంగా మిత్రపక్షాలుగా చెప్పుకుంటూనే టిడిపి బిజెపి అనధికార హౌదాలో రాజకీయంగా చేసుకుంటున్న విమర్శలు విసుర్లు కూడా నిగ్గు తేలాల్సి వుంది. మేమిచ్చిన నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారో లెక్కలు రావడం లేదని దారితప్పుతున్నాయని బిజెపి నేతలు ఆరోపిస్తుంటారు. వారిపై టిడిపి నేతలు ఎదురు దాడి చేస్తున్నా ముఖ్యమంత్రి మాత్రం శనివారం మీడియా గోష్టిలో అన్ని వివరాలు పంపుతామంటూ ఒకింత సంజాయిషీ ధోరణిలో మాట్లాడ్డం గమనార్హం. రాజధానికి 2500కోట్టు ఇప్పటివరకూ ఇచ్చినా నిర్మాణానికి నిర్దిష్టంగా చేసిన వ్యయమేమిటో ఇంతవరకూ నివేదించలేదని కేంద్రం అంటున్నది. రాజధాని నిర్మాణమంతా సింగపూర్ కంపెనీలకు అప్పగించి కేంద్రానికి తెలియకుండా చేస్తున్నారనే విమర్శ నిజమైతే తీవ్రమైందే. ఉత్తరాంధ్ర రాయలసీమలలో వెనకబడిన జిల్లాలలో సమస్యలు తీవ్రంగా వుండటమే గాక అసంతృప్తి నెలకొన్న సమయం. కేంద్రమే గీచిగీచి జిల్లాకు యాభై కోట్ల చొప్పున ఇస్తే అందులోనూ 13 కోట్టు మాత్రమే ఖర్చు చేయడాన్ని ఏమనాలి? అసలు కేంద్రం నుంచి రావలసినదెంత వచ్చిందెంత అనే వివరాలపై రాష్ట్రం, రాష్ట్రానికి ఇచ్చిన దానిలో ఫిర్యాదులేమిటనేది కేంద్రం కూడా రాజ్యాంగ బద్దంగా శ్వేత పత్రం రూపంలో ప్రజలకు చెప్పాలి తప్ప రాజకీయ లాలూచీ కుస్తీ తరహాలో స్వరం పెంచుతూ తగ్గించుతూ ప్రజలను గజిబిజి సృష్టించడం అనుమతించరానిది. ప్రత్యేక హౌదా కృష్ణర్పణమైందని, ప్యాకేజికి పిండ ప్రదానం జరిగిపోయిందని అనుక్షణం వారికి అర్థమవుతూనే వుంది.