రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్‌లో మీడియాతో మాట్లాడిన, కార్యకర్తల ముందు ప్రసంగించిన విషయాలపై మీడియా స్పందన వింతగా వుంది. పార్టీ మార్పుపై స్పష్టత ఇచ్చారనీ, కథనాలు ఖండించారని రెండు ప్రముఖ పత్రికలు శీర్షికలు ఇచ్చాయి. ఒకటిరెండు వెబ్సైట్లు కూడా అలాగే చేశాయి. ఛానళ్లు మాత్రం స్పందించిన రేవంత్‌రెడ్డి అంటూ సరిపెట్టాయి. ఒక ఛానల్ మాత్రం చంద్రబాబు విశ్వాసాన్ని వమ్ము చేయను అనడాన్ని హైలెట్ చేసింది. అయితే రేవంత్ ఖండనలో స్పష్టత లేదని టిటిడిపి అద్యక్షుడు ఎల్.రమణ మాత్రం పొలిట్‌బ్యూరో సమావేశం తర్వాత కుండబద్దలుకొట్టారు. కొడంగల్ వ్యాఖ్యలు దృష్టికి తెచ్చినప్పుడు తాము వాటిని పూర్తిగా వినలేదంటూనే కాంగ్రెస్ నేతలను కలవడం,దాంట్లో చేరడంపై సూటిగా వివరణ ఇవ్వలేదని ఖండించలేదని పునరుద్గాటించారు. పార్టీకే కనిపించని స్పష్టత కొన్ని మీడియా సంస్థలకు ఎలా కనిపించిందో అర్థం కాదు. ఇక రేవంత్ వ్యాఖ్యలను పరిశీలిస్తే చంద్రబాబు తనకు బాధ్యత అప్పగించి వెళ్లారు గనక ఆయన విదేశాలలో వున్నప్పుడు విశ్వాసాన్ని వమ్ము చేయనని చెప్పినట్టు భావించాలి. ఆయనకు ఏదైనా చెప్పగల ధైర్యం సాన్నిహిత్యం వున్నాయంటే పార్టీ మారడం గురించి కూడా చెప్పగలనని అర్థం తీయొచ్చు. దానికంటే ముందు రేవంత్ మీరే(కొడంగల్‌లో అనుయాయులు) నాకు అధిష్టానం అనడం ఆసక్తికరం. చంద్రబాబును కలిశాక మళ్లీ వచ్చి మీతో మాట్లాడి సలహాలు తీసుకుని పోరాటం కొనసాగిస్తానని మాత్రమే చెప్పారు. అంతేగాని కాంగ్రెస్ నాయకులను కలవలేదని గాని, పార్టీ మారే ప్రసక్తి లేదని గాని ఖండించింది లేదు. నాయకుని అదేశాల మేరకు వ్యవహరిస్తాను అంటూనే మీరే అధిష్టానం మీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాననడం ద్వారా పార్టీ మార్పునకు తలుపులు అట్టిపెట్టుకున్నారని చెప్పాలి. కాబట్టి దీన్ని స్పష్టతగానో ఖండనగానో చెప్పడం నిరాధారం. పైగా రమణ వ్యాఖ్యలు చంద్రబాబు ఆదేశాలు లేకుండా చేసినవి కావు. ఆయనతో ఫోన్లో మాట్లాడిన తర్వాతనే పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశం రేవంత్ లేకుండా జరిపాకనే ఈ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి కథలో పెద్ద మార్పులేదు. కాకుంటే అంతులేకుండా సాగుతున్నదంతే.