చట్టం తన పని తాను చేయనప్పుడు, చేయలేనప్పుడు.. సామాన్యుల నుంచి తిరుగుబాటు మొదలవుతుంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని… తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకొంటారు! – ఈ కథ ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా చూడగలుగుతున్నాం అంటే… ఆ పాయింట్‌కి ‘సామాన్యుడు’లా కనెక్ట్ అవ్వడమే కారణం. ‘మామ్’ కథ కూడా అలానే సాగింది. తన కూతురిపై అత్యాచారానికి ఎగబడ్డ నలుగురిపై ఓ తల్లి తీర్చుకొన్న పగ.. ‘మామ్’ కథ. మరి ‘మామ్’
గా శ్రీదేవి ఎలా మెప్పించింది?? శ్రీదేవి రీ ఎంట్రీకి ఈ సినిమా ఎంత వరకూ ఉపయోగపడింది?? తెలియాలంటే.. సమీక్షలోకి వెళ్లాల్సిందే.
* కథ
దేవకి (శ్రీదేవి) ఆనంద్ (అద్నాన్ సిద్దికి) భార్యా భర్తలు. దేవకి.. ఆనంద్కి రెండో భార్య. అందుకే… ఆనంద్ కూతురు ఆర్య (సాజల్ అలీ) దేవకిని అమ్మగా స్వీకరించలేదు. ‘మేడమ్’ అని పలకరిస్తుంది తప్ప, ‘మామ్’ అని ఏనాడూ పిలవదు. అయితే దేవకి మాత్రం ఆర్యని తన కన్నకూతురిలానే చూసుకొంటుంది. ఓ పార్టీకి వెళ్లిన ఆర్య… అక్కడ నలుగురు దుర్మార్గుల చేతిలో అత్యాచారానికి గురవుతుంది. ఆ నలుగుర్నీ పోలీసులు పట్టుకొంటారు. కోర్టు మాత్రం సాక్ష్యాధారాలు లేవని వాళ్లని వదిలేస్తోంది. కళ్ల ముందు కూతురు పడుతున్న నరక యాతన చూడలేక, ఆ నలుగురు దుర్మార్గుల భరతం పట్టడానికి రంగంలోకి దిగుతుంది దేవకి. ఇందుకు ఓ డికెక్టీవ్ (నవాజుద్దీన్ సిద్దికీ) సహాయం తీసుకొంటుంది. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొన్న దేవకి.. తన కూతురికి జరిగిన అన్యాయానికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకొంది? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
ఇలాంటి కథలు చాలా చూసేశాం. అయితే అవన్నీ హీరో నేపథ్యంలో సాగే కథలే. ఉదాహరణకు దృశ్యం. తన కూతుర్ని, భార్యనీ రక్షించడానికి ఓ మధ్యతరగతి భర్త ఎలాంటి నిర్ఱయం తీసుకొన్నాడు?? చట్టంలోని లొసుగుల్ని ఎలా వాడుకొన్నాడన్నదే ‘దృశ్యం’ కథ. ‘మహానది’ కూడా అలాంటిదే. కన్నకూతుర్ని వ్యభిచార గృహంలో చూసిన తండ్రి.. ఆవేదనకు అద్దం పట్టింది. ‘మామ్’ విషయానికొస్తే.. ఇది ఓ తల్లి ఆవేదన. రేప్ అనేది శారీరక హింస కాదు.. అదో మానసిన నరకం. రేప్‌కి గురయ్యేది కాసేపే.. కానీ ఆ చేదు జ్ఞాపకం జీవితాంతం వెంటాడుతుంటుంది. రేప్‌కి గురైన అమ్మాయిలు, వాళ్లింట్లో తల్లిదండ్రులు పడే ఆవేదన.. ఈ చిత్రంలో మరోసారి కళ్లకు కట్టారు. కొన్ని సన్నివేశాలు చూస్తే గుండె తరుక్కుపోతుంటుంది. ఈ చట్టం, సమాజంపై అసహ్యం వేస్తుంది. ఆ స్థాయిలో సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు దర్శకడు. అత్యాచారాన్ని చూపించకుండానే… ఆ ఇంపాక్ట్‌ని తెరపై రప్పించగలిగాడు. మన కళ్లముందు తూనీగలా తిరుగుతున్న అందమైన అమ్మాయిని ఎవరైనా చిదిమేస్తే.. ఎంత బాధ కలుగుతుందో.. ఈ సినిమాలో ఆర్య అత్యాచారానికి గురైనప్పుడు కూడా అంతే వేదన కలుగుతుంది. తల్లిగా దేవకి తీసుకొన్న నిర్ఱయం సరైనదే అనిపిస్తుంది. ఇవన్నీ.. కథలో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేశాయి. ద్వితీయార్థంలో ఒకొక్క దుర్మార్గుడిపై పగ తీర్చుకొంటుంది దేవకి. సహాయం చేసిన.. డిటెక్టీవ్ పాత్రనీ చాలా ఉదాత్తంగా చూపించాడు దర్శకుడు. అయితే.. ప్రతీకారం మరీ మామూలుగా ఉంది. అక్కడ దేవకి ‘సైన్స్’ తెలివితేటలు ఇంకా బాగా ఉపయోగిస్తే బాగుండేది. స్వతహాగా దేవకిని సైన్స్ టీచర్‌గా చూపించారు. ఆ సబ్జెక్ట్‌ని తన పగకు ఆయుధంగా మలచుకొంటే.. ‘మామ్’ మరోలా ఉండేదేమో…?? చట్టం, సమాజంపై పెద్ద పెద్ద లెక్చర్లేం దంచలేదు. కాకపోతే… ఈ చట్టాలు, వ్యవస్థలు, మనుషుల మనస్తత్వాలూ మారాలన్న గట్టి సంకేతాన్ని.. ‘మామ్’ ఇస్తుంది.
* నటీనటుల ప్రతిభ
శ్రీదేవి నటించింది అంటే తప్పకుండా తక్కువ చేసినట్టు. ఆ పాత్రలో ప్రవర్తించిందంతే! ఇద్దరు ఆడపిల్లలకు తల్లి అవ్వడం వల్లేమో.. ఆ పాత్రకు బాగా కనెక్ట్ అయిపోయింది. శ్రీదేవికి ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూడకపోవడం వల్లనేమో… ఇంకా బాగా నచ్చుతుంది. నవ్వడం, ఏడవడం, భావోద్వేగాలు ప్రదర్శించడం ఏ నటి అయినా చేస్తుంది. కానీ వణకడం ఏమిటి?? ఓ సన్నివేశంలో శ్రీదేవి వణికిపోతూ నటించింది. శ్రీదేవి ఈ పాత్రని ఎంత ఓన్ చేసుకొందో చెప్పడానికి ఆ షాట్ ఓ ఉదాహరణ మాత్రమే. ఆర్య పాత్రలో కనిపించిన అమ్మాయి అందంగా ఉంది. శ్రీదేవి సినిమాలో మరో కథానాయిక కి ఈ కాంప్లిమెంట్ దక్కడం నిజంగా ఆశ్చర్యమే. ఆర్య ఓ షాట్లో చేతిలో గులాబీ పువ్వుతో కనిపిస్తుంది. అంత అందమైన గులాబీ.. ఆమె ముందు చిన్నదైపోతుంది. నవాజుద్దీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు.. ఆ పాత్రలో నవాజుద్దీన్ కనిపించడు.. డికెక్టీవ్ తప్ప.
* సాంకేతిక వర్గం
దర్శకుడు అనుకొన్న పాయింట్ పాతదే. కానీ.. అందులోని భావోద్వేగాలకు జీవం ఉంది. ఓ తల్లి ఆక్రోశం అందరికీ కనెక్ట్ అయ్యే పాయింటే. ఆ పాయింట్‌కి రెహమాన్ నేపథ్య సంగీతం బలం తీసుకొచ్చింది. ఈమధ్య రెహమాన్ ఇచ్చిన బెస్ట్ వర్క్స్‌లో ఇదొకటి. చాలా చోట్ల… రెహమాన్ సంగీతం మాట్లాడుతుంటుంది. నిశ్శబ్దంలోంచి పుట్టుకొచ్చిన రెహమాన్ నేపథ్య సంగీతం చాలా చోట్ల.. సమాధానం చెబుతుంటుంది. సంభాషణలు అక్కడక్కడ మెరుస్తాయి. చప్పట్లు కొట్టిస్తాయి. మొత్తంగా…. ‘మామ్’ ఓ ఎమోషనల్ జర్నీ. మహిళలపై జరుగుతున్న అన్యాయాల్ని ‘పింక్’ ఓ రూపంలో చూపిస్తే.. ‘మామ్’ మరో రూపంలో చూపించింది.
* ఫైనల్ టచ్ : ‘మామ్`’.. ఓ అమ్మ ప్రతీకారం