హీరోలకు వారసులు ఉండడం `అదనపు` బాధ్యతే అనుకోవాలి. అబ్బాయిలైతే హీరోలుగా పరిచయం చేయడం తప్పనిసరి బాధ్యత అవుతుంది. వాళ్లెలా ఉన్నా సరే… `హీరో`ని చేయాల్సిందే. అదృష్టం ఉంటే.. వారసుడిగా నిలబడతాడు. లేదంటే ప్రయత్నం మాత్రం మిగులుతుంది. కానీ.. ఎంతో కొంత ఖర్చు చేయాలి. హీరోలు తమ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత వాళ్లపైనే వేసుకుంటారు. నిర్మాతగా మరో పేరు కనిపిస్తున్నా, వెనుక నుంచి నిధుల్ని అందించేది మాత్రం వాళ్లే.
అయితే శ్రీకాంత్‌కి ఆ సమస్య తప్పింది. తనయుడు రోషన్ ఇది వరకే `నిర్మలా కాన్వెంట్`తో హీరో అయిపోయాడు. ఆ సినిమా నిర్మాణ బాధ్యతలన్నీ అన్నపూర్ణ స్డూడియోస్ చూసుకుంది. సినిమా ఫ్లాప్ అయ్యింది. నిర్మాత తాను కాకపోవడం వల్ల శ్రీకాంత్ సేఫ్ అయిపోయాడు. నిర్మలా కాన్వెంట్ వచ్చి రెండేళ్లు దాటేసింది. ఇప్పుడు రోషన్ మరోసారి హీరోగా మారాలని ఉబలాటపడుతున్నాడు. ఈసారీ.. శ్రీకాంత్‌కి ఖర్చు మిగిలింది.కారణం.. రెండో సినిమా బాధ్యతల్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మోస్తున్నారు. రోషన్ హీరోగా గౌరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. దీనికి నిర్మాత, దర్శకత్వ పర్యవేక్షణ రెండూ రాఘవేంద్రరావే. ఈ సినిమా ఆడితే, రోషన్‌కి మంచి భవిష్యత్తు ఏర్పడడం ఖాయం. నిజానికి రోషన్ రెండో సినిమాని తన నిర్మాణ సంస్థలోనే తీద్దామనుకున్నాడు శ్రీకాంత్. కానీ రాఘవేంద్రరావు ముందుకు రావడంతో ఈసారీ శ్రీకాంత్‌కి ఖర్చు తప్పిపోయింది.