ఏపీ నుంచి బీజేపీ తరపున గెలిచిన ముగ్గురిలో నర్సాపురం ఎంపీ శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కబోతోంది. అసలు ఆయన పేరు ఉంటుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. దశాబ్దాలుగా బీజేపీలో ఉంటున్నప్పటికీ ఆయన గతంలో అనుభవించిన కీలక పదవి భీమవరం వార్డు కౌన్సిలర్ మాత్రమే . అయితే ఆయనకు అనూహ్యంగా నర్సాపురం ఎంపీ టిక్కెట్ దక్కడం… గెలవడం అయిపోయాయి. ఆ సీటు కోసం రఘురామరాజు చేయని ప్రయత్నాలు లేవు. అయినా శ్రీనివాసవర్మకే సీటు వచ్చింది. గెలిచి .. కేంద్రమంత్రి అవుతున్నారు.
ఏపీ నుంచి బీజేపీ కోటాలో పురందేశ్వరి లేదా సీఎం రమేష్ కే ఎక్కువ చాన్స్ ఉందనుకున్నారు. పురందేశ్వరి పదేళ్లు కేంద్రమంత్రిగా పని చేశారు సీనియర్ నేత. ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్నారు. సీఎం రమేష్ బీజేపీ అగ్రనేతలకు సన్నిహితుడు. అయితే వీరిద్దర్నీ కాదని వర్మకు చాన్సిచ్చారు మోదీ. టీడీపీ కోటా నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని మంత్రులుగా బాధ్యతలు తీసుకుంటున్నారు
తెలంగాణ నుచి బండి సంజయ్, కిషన్ రెడ్డిలను కేబినెట్ లోకి తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి విడతలో మొత్తం ఐదుగురు మంత్రులు ఉంటున్నట్లు లెక్క. గత మోదీ ప్రభుత్వంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కరే కేంద్ర మంత్రి. ఈ సారి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి.. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు కేబినెట్ ర్యాంక్ మంత్రులుగా ఉండబోతున్నారు.