తెలుగు రాష్ట్రాల రైతాంగానికి గొప్ప శుభవార్త. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో… డెడ్ స్టోరేజ్ కు చేరిన శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గడిచిన 15 రోజుల్లో నారాయణ పేట జలాశాయం, ఆల్మట్టి నుండి కిందకు నీరు వదులుతుండగా… ఉప నదుల నుండి కూడా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారుతోంది.
జురాల ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండటంతో వచ్చిన నీరు వచ్చినట్లు శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు పై నుండి 4లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో సోమవారం ఉదయం వరకే 215టీఎంసీల కెపాసిటీ ఉన్న శ్రీశైలంలో 171టీఎంసీల నీరుంది. దీంతో కిందకు నీరు వదిలేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.
సాయంత్రం 4గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తబోతున్నారు. పై నుండి వచ్చే వరదను బట్టి ఎన్ని గేట్లు, ఎంత మేర పైకెత్తాలని అధికారులు నిర్ణయించబోతున్నారు. ఇప్పుడున్న వరద ఇలాగే కొనసాగితే నాలుగైదు రోజుల్లో ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ నీటిమట్టానికి చేరే అవకాశం ఉంది. పై నుండి వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించారు. శ్రీశైలం నుండి కిందకు నీరు వదిలితే నాగార్జున సాగర్ కు నీరు చేరనుంది. సాగర్ లో ప్రస్తుతం కేవలం 134టీఎంసీల నీరు మాత్రమే ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 312 టీఎంసీలు.