పుట్టుకల గురించి మాట్లాడటం.. ఏపీ రాజకీయాల్లో కామన్. అక్కడ వైసీపీ నేతలు.. తమ పుట్టుకను ప్రశ్నిస్తారని తెలిసి కూడా.. ఎదుటి వారిపై అలాంటి నిందలేస్తూ ఉంటారు. ఫలితంగా అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరి పుట్టుకల్ని ఒకరు అనుమానించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ జాడ్యం తెలంగాణకు కూడా పాకింది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య.. తన రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరి దళితుడు కాదని చెప్పేందుకు నీచమైన భాషను ఎంచుకున్నారు.
రాజయ్యను వదిలించుకుని ఈ సారి కడియం శ్రీహరికి లేదా ఆయన కుమార్తెకు టిక్కెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై రాజయ్య మండి పడుతున్నారు. అయితే హైకమాండ్ ను ఏమీ అనలేక..రాజయ్యపై ఆరోపణలు తీవ్ర తరం చేశారు. ఆయన అవినీతి పరుడని.. ఎన్ కౌంటర్ల సృష్టికర్తని చెప్పడం ప్రారంభించారు. వీటికి తోడు కొత్తగా ఆయన దళితుడు కాదని చెప్పడానికి.. ఆయన ఎవరికి పుట్టాడో తెలియదన్నట్లుగా మాట్లాడారు.
ఓ గ్రామంలో జరిగిన సమావేశంలో కడియం శ్రీహరి తల్లి పద్మశాలి బీసీ. తల్లి అనేది నిజం, తండ్రి అనేది ఊహ అని చెప్పుకొచ్చారు. ఆయన మాటలు కలకలం రేపుతున్నాయి. ఒక్క కడియం శ్రీహరిని ఆయన అవమానించలేదని.. మొత్తం మహిళల్ని అవమానించినట్లు అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా.. పుట్టుకలను కూడా ప్రశ్నించే దౌర్భాగ్య స్థితికి రాజకీయాలు దిగజారిపోవడం విస్మయ పరుస్తోంది.
రాజయ్య ఆరోపణలపై కడియం శ్రీహరి మౌనంగానే ఉన్నారు. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నారు.