మూడు వేల పాటలు రాసిన కలం.. సిరివెన్నెలది. అందులో అద్భుతం అనదగ్గ పాటలెన్నో..? ప్రతీ పాటలోనూ తనదైన మార్క్, ఛమక్కు ఉంటాయి. ఒక్కో పాటకోసం కనీసం రెండు మూడు నెలలు కష్టపడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే.. అవన్నీ అణిముత్యాలు. అక్షర కుసుమాలూ అయ్యాయి. సిరివెన్నెల కొన్ని పాటలు కూడా పాడారు. అయితే తన తొలి పాట.. అత్యంత పాపులర్ అయ్యింది. అదే.. `తెల్లారింది లెగండోయ్.. కొకొరొక్కో`.
కళ్లు సినిమాలోని పాట ఇది. ఎంవీ రఘు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి దిగ్గజ గాయకుడు.. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకత్వం వహించడం విశేషం. ఓ కెమెరామెన్ దర్శకుడుగా, గాయకుడు సంగీతం అందించిన చిత్రంలో.. ఓ కవి పాట పాడడం.. అరుదైన సంఘటన. అది కళ్లుతో ఆవిష్కృతమైంది. ఈ సినిమా సారాంశం మొత్తం.. ఓ పాటలో ఆవిష్కరించే పని సిరివెన్నెలకు అప్పగించింది చిత్రబృందం. దానికి బాలు ట్యూన్ కట్టలేదు. సాహిత్యం అందించాకే.. పాటకు ట్యూన్ కడతా అన్నారు. సిరివెన్నెలకు ఓ అలవాటు ఉంది. తనకు తానే ఓ డమ్మీ ట్యూన్ సృష్టించుకుని పాట రాయడం. ఆ ట్యూన్ తోనే పాటని అప్పజెప్పడం. అదే చేశారు. సిరివెన్నెల గొంతులో ఆ పాట విన్న.. బాలుకి బాగా నచ్చేసింది. `ఈ పాట మీరే ఎందుకు పాడకూడదు` అని సిరివెన్నెలను బలవంతం చేశారు. “పచ్చి గొంతుతో పాడాల్సిన పాట అది. ఓ గాయకుడు పాడితే అంత మజా రాదు“ అని సిరివెన్నెలను ఒప్పించారు. కానీ సిరివెన్నెల రిహార్సల్స్ అడిగారు. పదిసార్లో, పదిహేనుసార్లో రిహార్సల్స్ చేసుకున్న తరవాత.. `నేను పాటకు రెడీ` అన్నారు సిరివెన్నెల. కానీ బాలు `అక్కర్లెద్దు…మీరు రిహార్సల్స్ చేస్తుండగానే రికార్డ్ చేసేశా“ అన్నార్ట. అలా.. ఈ పాట రెడీ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వినిపిస్తూనే ఉంది.
సీతారామశాస్త్రి దత్త పుత్రుడు ఎవరో తెలుసా?
సీతారామశాస్త్రికి ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఇద్దరు అబ్బాయిలూ సినిమా రంగంలోనే ఉన్నారు. రాజా నటుడిగా, యోగి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. అయితే… సీతారామశాస్త్రికి ఓ దత్త పుత్రుడు కూడా ఉన్నారు. ఆయనెవరో కాదు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ.
కృష్ఱవంశీ అంటే సీతారామశాస్త్రికి, సీతారామశాస్త్రి అంటే కృష్ణవంశీకి వల్లమాలిన అభిమానం. ఈ తరం దర్శకులలో.. సీతారామశాస్త్రి అత్యంత అభిననంగా, చనువుగా, ప్రేమగా చూసేది కృష్ణవంశీనే. తన సినిమాల్లో సింహ భాగం పాటలు ఆయనే రాశారు. అవి గొప్ప పాటలు కూడా. అర్థ శతాబ్దపు అజ్ఙానాన్ని (సింధూరం), ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ (మహాత్మ), నువ్వు నువ్వు (ఖడ్గం), ఎటో వెళ్లిపోయింది మనసు (నిన్నే పెళ్లాడతా).. ఇలా ఒక్కో పాటలో ఒక్కో ఆణిముత్యం అందించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే జగమంత కుటుంబం నాది (చక్రం) మరో ఎత్తు. అందుకే వీళ్ల బంధం.. మరింత ధృఢంగా మారిపోయింది.
ఇక దత్తత విషయానికొస్తే.. కృష్ణవంశీ – రమ్యకృష్ణల వివాహం సమయంలో, కృష్ణవంశీని దత్తత తీసుకున్నారు సిరివెన్నెల. ఆ తరవాత.. ఆయనేదగ్గరుండి వీరిద్దరి పెళ్లీ చేశారు. అప్పటి నుంచీ.. కృష్ణవంశీ పుత్రసమానుడు అయ్యాడు. తన తండ్రిపోతే.. కొడుకు ఎలా విలవిలలాడిపోతాడో, అలా తయారయ్యాడిప్పుడు కృష్ణవంశీ. ఆయన్ని ఓదార్చడం ఎవరికీ వీలవ్వడం లేదు. కనీసం చివరి చూపు చూడ్డానికి కూడా కృష్ణవంశీ ధైర్యం చేయలేకపోతున్నాడట. ఆ వేదన ఎవతూ తీర్చలేనిది.