ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులకు పాల్పడింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ‘ఇది ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా’ అంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
తాజాగా ఈ కేసులో సల్మాన్ ఖాన్ స్వయంగా లారెన్స్ బిష్ణోయ్ పేరుని ప్రకటించాడు. నన్ను, నా కుటుంబాన్ని చంపేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర చేస్తోందని క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చారు. కాల్పులు జరిగిన ఏప్రిల్ 14వ తేదీన ఇంట్లోనే ఉన్నానని, బుల్లెట్ల శబ్దంతోనే నిద్రలేచానని వివరించారు.
సల్మాన్ ఖాన్ స్టేట్మెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంశమైయింది. బాలీవుడ్ పై అండర్ వరల్డ్,గ్యాంగ్‌స్టర్ చరిత్రని మరోసారి గుర్తుకు తెచ్చింది. బాలీవుడ్ అండర్ వరల్డ్, గ్యాంగ్స్టర్స్ గుప్పిట్లో వుండేది. అండర్ వరల్డ్ ఏ స్థాయిలో బాలీవుడ్, అక్కడ తారలని భయపెట్టేదో అనేక ఉదాహరణలు వున్నాయి. చాలా మంది జీవితాలు నాశనమైన ఉదంతాలు వున్నాయి. రామ్ గోపాల్ వర్మ చాలా సినిమాల్లో దీనిని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. అయితే అదంతా గతం.
ఇప్పుడు బాలీవుడ్ పై మాఫియా, అండర్ వరల్డ్, గ్యాంగ్‌స్టర్ ప్రభావం పూర్తిగా మాయమైపొయిందనుకుంటున్న తరుణంలో బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకడైన సల్మాన్ ఖాన్ పైనే ఇలాంటి బెదిరింపు, హత్య ప్రయత్నాలు జరగడం ఒక్కసారిగా ఒలిక్కిపడేలా చేస్తోంది.
Also Read : బాలీవుడ్ ఫ్లాప్ హీరో… సౌత్‌లో దుమ్ము రేపుతున్నాడు
పంజాబ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్. ఎన్నో అక్రమాలు చేశాడు. ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణదారుల సిండికేట్‌కు బిష్ణోయ్ నాయకత్వం వహించాడు. 2014లో రాజస్థాన్ పోలీసులకు దొరికాడు. నాటి నుంచి అతడు జైల్లోనే ఉన్నాడు. 2021లో అతడిని దిల్లీలోని తిహాడ్ జైలుకు తరలించారు. 2022లో సింగర్ మూసేవాల హత్య కేసులో పంజాబ్ పోలీసులు పంజాబ్‌కు తీసుకెళ్లారు. వివిధ కేసుల్లో విచారణ నిమిత్తం అతడిని ఇప్పటికే పోలీసులు పలు జైళ్లకు మార్చారు.
ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నాడు. ఇతడి గ్యాంగ్ సభ్యులు భారత్‌లో పెద్దమొత్తంలో బలవంతపు వసూళ్లకు, మాదక ద్రవ్యాల, ఆయుధాల అక్రమ రవాణకు పాల్పడుతున్నారు. ఈ రకంగా సంపాదించిన సొమ్మును కెనడా, ఇతర దేశాలకు తరలిస్తున్నారు.
ఇప్పుడా గ్యాంగ్ కన్ను బాలీవుడ్ మీద పడిందని సల్మాన్ ఉదంతంతో స్పష్టమౌతోంది. పైకి కృష్ణ జింకల కేసు తీర్పు నేపధ్యంలో సల్మాన్ ని టార్గెట్ చేస్తున్నామని ఆ గ్యాంగ్ చెప్పుకుంటున్నా అసలు సంగతి మాత్రం అక్రమాలు, మనీ లాండరింగ్ కు బాలీవుడ్ ని అడ్డాగా చేసుకోవాలనే లక్ష్యంగా ఆ గ్యాంగ్ పని చేస్తుందనే వాదనలు వున్నాయి. ఈ గ్యాంగ్ బారిన పడిన బాధితులు బాలీవుడ్ లో ఇంకెంతమంది వున్నారనేది తెలియాల్సింది వుంది. ఏదేమైనా అంతమైపొయిందనుకున్న గ్యాంగ్‌స్టర్ విష సంస్కృతి మళ్ళీ మొలకెత్తడం అందోళనకరమే.