” హమ్మయ్య.. ఈడు బౌలింగ్‌కు దిగాడ్రా మనోళ్లకు పరుగులే పరుగులు. ఫోర్లు.. సిక్సులే చూసుకో..”
ఇది నేను చిన్నప్పుడు క్రికెట్ చూడటం ప్రారంభించిన తర్వాత ఓ మ్యాచ్‌లో పరుగులు తీయడానికి తంటాలు పడుతున్న ఇండియా ఆటగాళ్లకు మంచి టైం వచ్చిందని అనుకున్న సందర్బం అది. బహుశా షేన్ వార్న్ కూడా అప్పుడే తన కెరీర్ ప్రారంభించి ఉంటాడు. నేను క్రికెట్ చూడటం అప్పుడే ప్రారంభించి ఉంటా. ఫాస్ట్ బౌలింగ్ అంటే కష్టమని.. స్పిన్ బౌలింగ్ అంటే బాదేయడం ఈజీ అనుకునే ” క్రికెట్ బిగినర్ల”లో నేనూ ఒకడ్ని. అందుకే రెండు అంటే రెండు అడుగులు మాత్రమే రనప్ తీసుకుని బంతి విసిరే వార్న్‌ను మనోళ్లు ఓ ఆటాడుకుంటారని అనుకున్నాను. కానీ నా లెక్క తప్పిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా తప్పకపోయి ఉంటే ఈ రోజు ఆ బౌలర్ వార్న్ గురించి మనం గుర్తు చేసుకునే అవసరం కూడా ఉండేది కాదమో..!
రెండు అంటే రెండు అడుగుల ఆ రనప్ అప్పుడే నా మైండ్ లో స్థిరపడిపోయింది. అయితే పాజిటివ్‌గా కాదు.. నెగెటివ్‌గా. ఎప్పుడు ఎక్కడ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగినా వార్న్‌ను ఎన్ని పరుగులు కొట్టారో చూసేవాడిని. అదే ఇండియాతో జరిగే మ్యాచ్‌ల్లో అయితే మనోళ్లు.. వార్న్‌ను ఫోర్.. సిక్స్ బాదేసినా ఆ ఆనందం అలా ఇలా ఉండేది కాదు. ఎలాగైనా వార్న్ గొప్ప బౌలర్ కాదు అని మనోళ్లే తేల్చి పడేస్తారని ఆశపడేవాడ్ని . కానీ రాను రాను నా ఆశలు అడియాశలు అయ్యాయి. మనోళ్లు చేసే పరుగుల కన్నా.. అతనికి సమర్పించే వికెట్లు ఎక్కువైపోయాయి. షేన్ వార్నింగ్ అంటూ పేపర్లో వచ్చే హెడ్డింగ్లే కళ్ల ముందు కనిపిస్తూ ఉండేవి. అందుకే ఓ రకంగా వార్న్ అంటే నాకు నచ్చేది కాదు.. ఎంతగా అంటే శత్రువు అనుకునేవాడ్ని !
కానీ వయసుతో పాటు క్రికెట్ మజా తెలిసిన తరవాత వార్న్‌ను ద్వేషిస్తున్నాను కానీ అది ద్వేషం కాదని ఇష్టమని మెల్లగా అర్థమవడం ప్రారంభమయింది. అలా ప్రారంభమైన ఆ ద్వేషంతో కూడిన ఇష్టం.. నేను క్రికెట్ చూడటం తగ్గించే వరకూ సాగింది. 1999 ప్రపంచకప్‌లో సెమీఫైనల్, ఫైనల్ చూసిన తర్వాత వార్న్ లాంటి బౌలర్ పుట్టాల్సింది స్పిన్ పిచ్‌లకు పుట్టిల్లయిన ఇండియాలో కదా అనిపించింది. క్రికెట్ చూసినంత కాలం వార్న్ నా ఫ్రెండే అనుకునేవాడిని. అందుకే… మిత్రులతో ఎప్పుడు చర్చ వచ్చినా.. వార్న్ ని వాడు..వీడు అని సంబోధిస్తూ ఉంటాను. బహుశా.. ఇష్టమైన క్రికెటర్లందర్నీ అభిమానులు ఇలాగే పిల్చుకుంటూ ఉంటారు. చాల మంది మిత్రులు అలా మాట్లాడుకోవడం నేను చూశా. అదే అసలైన అభిమానం అని తర్వాత అర్థమయింది.
చదువులైపోయాక.. కెరీర్లో అడుగుపెట్టాక..క్రికెట్ చూడటం తగ్గిపోయింది. ఐపీఎల్ ప్రారంభమయ్యే నాటికి క్రికెట్‌పై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఇండియా- పాకిస్తాన్ లాంటి బెంచ్ మార్క్ మ్యాచ్‌లు.. ప్రపంచకప్‌లు తప్ప ఇక ఏ సీరిస్లనూ పట్టించుకోని పరిస్థితి వచ్చింది. బహుశా.. అప్పుడే వార్న్ కెరీర్ కూడా చివరికి వచ్చేసింది. కానీ ఐపీఎల్ మళ్లీ మొదలు పెట్టేలా చేసింది.
అన్నేళ్ల కెరీర్లోనూ ఐపీఎల్ మొదటి సీజన్లో అత్యంత నాసిరకం జట్టేది అంటే.. రాజస్థాన్ రాయల్స్ అని అందరితో పాటే నేనూ అనుకున్నారు. వార్న్‌పై ఎంత నమ్మకం ఉన్నా.. అప్పటికే కెరీర్ ముగిసిపోయే దశకు రావడం.. టీ ట్వంటీ అంటే బ్యాట్స్ మెన్ గేమ్ అనుకోవడంతో .. ఆ వార్న్ ఏమీ చేయడులే అనుకున్నా.. అలా ఏమీ చేయకుండా ఉంటే వార్న్ ఎందుకవుతాడు.. రాజస్తాన్ రాయల్స్‌ను చాంపియన్‌గా నిలబెట్టాడు.
వార్న్ ఆటే కాదు… లైఫ్ స్టయిల్ కూడా అబ్బుర పరుస్తూనే ఉంటుంది. మనమంతా ఎలా జీవించాలని ఊహించుకుంటామో అలా జీవిస్తాడు. అమ్మాయిలతో వార్న్ చేసే రొమాన్స్‌లు గురించి కథలు కథలుగా చెప్పినప్పుడు.. ఎలిజబెత్ హర్లీతో రిలేషన్ గురించి స్టోరీలు వచ్చినప్పుడు.. మనోడు ప్లే బాయ్ వివరాలు మీడియాలో వచ్చినప్పుడు ఏం లైఫ్‌రా వార్న్ అనుకోవడమే. అలాగే బిజినెస్ లైఫ్ లోనూ ఎక్కడా వెనుకబడని ఆ స్టైల్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకునే లైఫ్.. ఎవరికీ సాధ్యం కాదు. గేంబ్లింగ్ అడినా.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా… పదుల సంఖ్యలో అమ్మాయిలతో రొమాన్స్ చేసినా.. వార్న్ స్టైలే అది. వార్న్ లైఫే అది. అందరూ చేయాలనుకునేది కానీ వార్న్ చేస్తారు.
నేను క్రికెట్ చూడటంతో ప్రారంభమైన వార్న్ కెరీర్ .. నాకు క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోయినప్పుడే ముగిసిపోవడం యాధృచ్చికం కావొచ్చు. నేను వార్న్‌ను ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. కనీసం స్టేడియంకి వెళ్లి చూడలేదు. ఎప్పుడూ టీవీల్లోనే చూశారు. ఇప్పుడు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు టీవీల్లో పాత వీడియోలు చూస్తా. అందుకే వార్న్ బతికున్నాడా.. చనిపోయాడా అన్నది డోంట్ కేర్.
కానీ వార్న్ మాత్రం ఎవర్ గ్రీన్.. రియల్ ఎవర్ గ్రీన్..!