ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు.. ఒకప్పుడు ఉప్పూ నిప్పు! ఓటుకు నోటు కేసు తెరమీద ఉన్న సమయంలో ఈ ఇద్దరి పంతాలూ ఏ స్థాయికి చేరతాయో అనిపించింది. కానీ, ఆ తరువాత పరిస్థితి నెమ్మదిగా మారింది. ఇప్పుడు మరింత మారిపోయేందుకు వాతావరణం సిద్ధమౌతోంది. తెలంగాణలో తెరాస – టీడీపీల మధ్య పొత్తు పొడిచేట్టుగానే ఉంది. ఈ పొడుపునకు అడ్డుగా ఉన్న ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డికి పార్టీ నుంచి దాదాపు పొగబెట్టినట్టే..! సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నర ఉందనగా చంద్రులిద్దరూ దగ్గరౌతున్న తీరు శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్థమానం అవుతోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసికట్టుగా ఉంటే మంచిదే. కానీ, కేవలం ‘ఐకమత్యం’ ప్రదర్శించడం కోసమేనా ఈ ఇద్దరూ దగ్గరౌతున్నది..? కాదు కదా, దీని వెనక అంతకుమించిన రాజకీయ ప్రయోజనం కచ్చితంగా ఉండాలి కదా! ఎందుకంటే, ఇక్కడ ఉన్నదెవరు.. ‘కేసీఆర్, చంద్రబాబులు’! తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కలయిక వెనక పెద్ద వ్యూహమే ఉందనిపిస్తోంది.
ప్రస్తుతం చోటు చేసుకుంటున్న ఈ రాజకీయ పరిణామాలన్నీ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నవే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో భాజపాతో పొత్తును యథాతథంగా కొనసాగించుకోవడం టీడీపీకి అనివార్యం. ఎందుకంటే, ఏమాత్రం పట్టు సడలినా భాజపా పంచన చేరిపోయేందుకు వైకాపా సిద్ధంగా ఉంది. చేర్చుకునేందుకు భాజపా వెనకాడే పరిస్థితీ దాదాపు ఉండకపోవచ్చు. అలాగని, టీడీపీ సోలోగా భాజపాతో పొత్తు కోసం పాకులాడితే… ఆ పార్టీ గొంతెమ్మ కోర్కెలు తీర్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా అత్యధిక ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు అడిగే అవకాశం కచ్చితంగా ఉంటుంది. అంటే, పొత్తుల కూర్పులో భాజపాదే పైచేయి అయ్యే అవకాశం ఉంది. పొత్తు ఉండాలీ.. కానీ, మన మాటే పైమాటై చెల్లుబాటుగా ఉండాలంటే టీడీపీ దగ్గర కొత్త ఆకర్షణ ఏదో కావాలి. కొత్త బలమేదో భాజపాకి కనిపించాలి. ఆ ఆకర్షణే తెరాసతో పొత్తు అనుకోవచ్చు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోణం నుంచి ఆలోచించినా.. ఆయన కోరుకునేదీ ఇదే కదా! ఎలాగూ భాజపాతో పొత్తు కోసం ఆయనా పాకులాడిన సంగతి తెలిసిందే. అలాగని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో అంటకాగే సమస్యే లేదు. కాబట్టి, కేసీఆర్ ఆప్షన్ కూడా భాజపానే అవుతుంది. తెలంగాణలో భాజపాతో పొత్తు కుదిరినా.. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఏపీలో టీడీపీకి ఎదురుకాబోయే అనుభవమే, తెలంగాణలో కేసీఆర్ కు ఎదురుకావొచ్చు. భాజపా చెప్పినట్టు నడుచుకోవాల్సిన పరిస్థితి ఎదురు కావొచ్చు. అలా కాకుండా… తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే ఏం చెయ్యాలీ… తెరాసకు అదనపు ఆకర్షణో బలమో ఏదో కావాలి. అది చంద్రబాబుతో దోస్తీ అనుకోవచ్చు. ఇద్దరు చంద్రులు ఏకం కావాలి. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు!
ఒక్కో రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకుని మరీ తమ గుప్పిట్లోకి భాజపా తెచ్చుకుంటోంది. ఏపీ తెలంగాణలు కూడా వారికేం ఎక్కువ కాదు. వారి వ్యూహాలను అడ్డుకునేంత బలం ఎల్లప్పుడూ ప్రాంతీయ పార్టీలకు ఉండదు! పోనీ, గతంలో మాదిరిగా అడుగడుగునా కాపాడేందుకు వెంకయ్య నాయుడు కూడా ఇప్పుడు చంద్రబాబుకి అందుబాటులో లేరు! తెలంగాణ విషయంలో తెరాసతో పొత్తుకి సై అనకపోతే.. కాంగ్రెస్ తో జతకు అక్కడ రేవంత్ రెడీ అయిపోతున్నారు. అదే జరిగితే ఏపీలో జగన్ ని సమర్థంగా ఎదుర్కొనే వ్యూహానికి గండిపడ్డట్టే కదా! ఏతావాతా ఎటు చూసుకున్నా.. ఇద్దరు చంద్రులకూ ఇదే ఉభయ తారకమంత్రంగా కనిపిస్తోంది.
ఇక, భాజపా కోణం నుంచి విశ్లేషిస్తే… 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వీలైనన్ని తక్కువ లోక్ స్థానాలు పోటీకి దక్కేలా చేయడమే వారి కీలక వ్యూహం. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యా లేదు. కానీ, తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి.. తెరాస, టీడీపీలతో పొత్తు పెట్టుకోవడం వినా వారికి వేరే మార్గం లేకుండా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధ్యమైనన్ని ఎంపీ సీట్లు దక్కించుకోవడం భాజపాకి అవసరం. కాబట్టి, పొత్తు ద్వారా కొన్ని దక్కినా… తెరాస, టీడీపీ ఎంపీల మద్దతు కూడా తమకే లభిస్తుంది కదా! సో.. ఈ ఉమ్మడి కార్యాచరణ వెనక ఇద్దరి చంద్రులు ఇంత వ్యూహాత్మకంగా ఉన్నారని కూడా చెప్పొచ్చు.