ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దగా దృష్టి సారించలేకపోయారు. ఎన్నికలు పూర్తయ్యాక… ఒకసారి అధికారులతో రివ్యూ చేశారు. అయితే, అలా రివ్యూ చెయ్యకూడదనీ, ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ చాలా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఇప్పుడు రాజధాని నుంచి వర్చువల్ సమీక్ష కాకుండా… నేరుగా ప్రాజెక్ట్ సందర్శనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తుండటం కొంత ఆసక్తికరంగా మారింది. ఈ మధ్యనే జరిగిన పోలవరం సమీక్షలో కొంతమంది అధికారులు పాల్గొంటే… కోడ్ అమల్లో ఉండగా ఎందుకు వెళ్లారంటూ కొంతమంది ఉన్నతాధికారులను ఎన్నికల సంఘం వివరణ కోరింది. ఈ నేపథ్యం ఇప్పుడు సీఎం టూర్ ఆసక్తికరంగా మారింది. పోలవరం పనులను పరిశీలించాక… అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష కార్యక్రమాన్ని సీఎం ప్లాన్ చేసుకున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా చర్చించాలని వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సీఎం సమీక్షకు హాజరౌతారా, డుమ్మా కొట్టే ప్రయత్నాలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
కోడ్ అమల్లో ఉందన్న కారణంతో చంద్రబాబు చేపడుతున్న ప్రతీ సమావేశానికీ, సమీక్షకీ ఈసీ మోకాలడ్డుతున్నా… కొంతమంది అధికారులు హాజరు కాకపోతున్నా కూడా ఇంత దూకుడుగా చంద్రబాబు ఎందుకు వ్యహరిస్తున్నారు..? అంటే… ఇది వ్యూహాత్మక ఎత్తుగడే అనేది కొంతమంది విశ్లేషకుల అంచనా. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్షలు, సమావేశాలూ నిర్వహిస్తున్నారనీ, ప్రధాని అలా చేస్తున్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా అదే స్థాయిలో అధికారాలు ఉంటాయనే వాదన చంద్రబాబుది. తన విషయంలో ఒకలా, ప్రధాని దగ్గరకి వచ్చేసరికి మరోలా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరగాలన్నదే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.
గెలుపు ధీమాతో చంద్రబాబు ఉన్నారనీ, వివిధ మాధ్యమాల ద్వారా తెప్పించుకున్న సమాచారంతో ఆయన ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన అంచనాకి వచ్చారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మరోసారి తానే ముఖ్యమంత్రి కావడం ఖాయమే ధీమా ఉంది కాబట్టే… ఇంత దూకుడుగా ఆయన వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా సమీక్షలు, సమావేశాలు పెట్టడం వల్ల కొంతమంది అధికారుల తీరును కూడా ఈ సందర్భంలో అంచనా వేసే అవకాశం ఉంటుందనేది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. చంద్రబాబు పోలవరం పర్యటన తరువాత మరోసారి వైకాపా నేతల విమర్శలు, ఈసీ స్పందనలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.