కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాన్ని పోలీసులు అడ్డుకుని, ఆయన్ని గృహ నిర్బంధం చెయ్యడం, కాపుల నేతల్ని అదుపులోకి తీసుకోవడం, యువతకు కౌన్సిలింగులు ఇవ్వడం.. ఇవన్నీ వరుసగా జరిగిపోతున్నాయి. ముద్రగడ చేపట్టిన ఛలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదనేది పోలీసుల వాదన! నిజానికి కిర్లంపూడిలో చోటుచేసుకున్న పరిణామాలేవీ అనూహ్యమైనవి కావు. ముద్రగడను మరోసారి గృహ నిర్బంధం చేస్తారని ముందు నుంచీ తెలుస్తున్నదే. ఆయన పాదయాత్ర కిర్లంపూడి దాటి బయటకి రాదనేదీ అర్థమౌతోంది. ముందేం జరగబోతోందో దాదాపు నెలరోజుల కిందటి నుంచీ తెలుస్తూ ఉంటే.. ఒక ఉద్యమాన్ని నడిపే నాయకుడిగా ముద్రగడ ప్రణాళిక ఎలా ఉండాలి..? వ్యూహరచన ఎంత పక్కాగా ఉండాలి..? కానీ, ఈసారి కూడా అలాంటి ముందస్తు వ్యూహాలేవీ ముద్రగడ వేసుకోలేదని మరోసారి స్పష్టమౌతోంది. గతంలో ఎదురైన అనుభవాల నుంచీ ఏమీ నేర్చుకోలేదా అనే విమర్శలూ అక్కడక్కడా వినిపిస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా జరుగుతున్నది రొటీన్ తంతు ఇదే! ముద్రగడ దీక్ష అంటారు, లేదంటే యాత్ర అంటారు! దానికి అనుమతుల్లేవని పోలీసులు అంటారు. సరిగ్గా ఆరోజు వచ్చేసరికి అక్కడి నుంచీ ఒకట్రెండు రోజుల హై డ్రామా! అంతే, అక్కడితో మరికొన్నాళ్లు కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి విరామం. ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయడంలో ముద్రగడ వ్యూహాత్మంగా వ్యవహరించలేదని మరోసారి విమర్శలు వినిపించడం మొదలౌతోంది. ఆ మధ్య జిల్లాలన్నీ కలియదిరిగారు. సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల్ని కలుసుకున్నారు. ఇకపై జిల్లా స్థాయిల నుంచి కూడా ఉద్యమం ఉంటుందన్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ కిర్లంపూడి కేంద్రంగానే ఉద్యమం సాగుతోంది. ముద్రగడను గృహ నిర్బంధం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున స్పందన వచ్చేలా జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. జిల్లా కేంద్రంలో నిరనసలు జరపాలి. కానీ, అలాంటి పక్కా ప్రణాళికలేవీ కాపు ఉద్యమంలో కనిపించడం లేదనే విమర్శ వినిపిస్తోంది.
ఛలో అమరావతి పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న సమయంలో ముద్రగడ ఏమన్నారంటే.. అనుమతులు వచ్చాక మళ్లీ పాదయాత్ర చేస్తాననీ, రోజూ కాపులు తన ఇంటికి రావాలనీ పిలుపునిచ్చారు. ఈ అనుమతుల గురించి ముందే ప్రయత్నిస్తే సరిపోయేది కదా! ప్రభుత్వాన్ని అనుమతి కోరినతే.. వారు ఎలాగూ నిరాకరిస్తారు. అదే విషయమై ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసేందుకు వాడుకోవచ్చు. కాపు నేతల్ని తన ఇంటికి రావాలని ఆయన ఇప్పుడు పిలుపునిచ్చారు! ఉద్యమ నేతగా ఈయన ప్రజల్లోకి వెళ్లాలిగానీ… అష్ట దిగ్బంధనంలో ఉన్న కిర్లంపూడికి రండి అంటే కాపులు ఎలా రాగలుగుతారు..? ముద్రగడ ఉద్యమం ఈసారి చాలా తీవ్రంగా ఉంటుందని కాపు సామాజిక వర్గం కూడా అనుకుంది. కానీ, ఇంకా ఆ తీవ్ర స్థాయి చేరే తొలి దశ కూడా దాటలేదు. మున్ముందు ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి మరి!