హారర్ సినిమాలపై ఓ బలమైన అభిప్రాయం ఇటు ప్రేక్షకుల్లోనూ, అటు నిర్మాతల్లోనూ ఉంది. తక్కువ బడ్జెట్ లో ఈ సినిమా తీయొచ్చు. లాభాలు కూడా ఆ స్థాయిలోనే వస్తాయి. హారర్ సినిమాల నుంచి వందల కోట్లు ఆశించొద్దు.. ఇలా ఫిక్సయ్యే సినిమాలు తీస్తారు. కానీ బాలీవుడ్ లో వచ్చిన ‘స్త్రీ 2’ ఈ అభిప్రాయాల నడ్డి విరగ్గొట్టి, బాక్సాఫీసు దగ్గర సంచలనాలు నమోదు చేస్తోంది. శ్రద్దాకపూర్ – రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలై పెద్ద హిట్ కొట్టింది. కంటెంట్ బలంగా ఉండడం, హారర్, కామెడీ రెండూ పర్ఫెక్ట్ గా మిక్స్ అవ్వడం వల్ల ప్రేక్షకుల్ని మెప్పించగలిగింది. తొలి రోజే రూ.50 కోట్లు సాధించి, విశ్లేషకుల్ని నివ్వెర పరిచింది. ఇప్పుడు ఏకంగా రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది. అతి తక్కువ రోజుల్లో రూ.500 కోట్లు సాధించిన చిత్రంగా ‘స్త్రీ 2’ కొత్త రికార్డ్ సృష్టించింది. నిజంగా ఇది అపూర్వ విజయం.
అటూ ఇటుగా రూ.60 కోట్లతో తెరకెక్కిన సినిమా ఇది. అది నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే సంపాదించుకొంది. థియేటర్ నుంచి వచ్చిన ప్రతీ పైసా లాభమే. అంటే ఇప్పటికే ఈ నిర్మాతకు రూ.500 కోట్లు వచ్చాయన్నమాట. బాలీవుడ్ బడా స్టార్లకు కూడా సాధ్యం కాని ఫీట్ ఇది. ఓ దెయ్యం సినిమా సొంతం చేసుకొంది. ఈ సినిమాతో శ్రద్దాకపూర్ రేంజ్ బాలీవుడ్ లో మరింత పెరిగింది. రాజ్ కుమార్ రావు ఎప్పుడూ కొత్త తరహా కథలతోనే ప్రయోగాలు చేస్తుంటాడు. తన ఖాతాలో మరో భారీ హిట్ పడింది. ‘స్త్రీ 2’ ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని హారర్ కామెడీ సినిమాలు రానున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఇలాంటి కథలు ఓ పది పన్నెండు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నట్టు టాక్.