తిరుమల తిరుపతిని పురావస్తు శాఖ అధీనంలోకి తీసుకుని రావాలని ఈ మధ్యనే కేంద్రం ఒక విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడంలో తూచ్ అంటూ జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. తిరుమలలో ఏదో జరిగిపోతోందనీ, శ్రీవారి ఆభరణాలూ నిధులకూ రక్షణ లేదన్న రీతిలో ఈ మధ్య గుప్పుమన్న విమర్శలూ చర్చలూ ఇప్పుడిప్పుడే కాస్త చల్లబడ్డాయి. మొత్తానికి, ఎలాగోలా తిరుమల పేరుతో ఏదో ఒక వివాదం లేవనెత్తి, రాజకీయ ప్రయోజనం పొందేందుకు పొంచి చూస్తున్న శక్తులేంటో అందరికీ తెలిసినవే! అవి ఇక్కడితో ఆగేట్టు లేవు.
ఇక, తాజా విషయానికొస్తే… తిరుమల తిరుపతిని ఆంధ్రప్రదేశ్ నుంచి విముక్తం చేయాలనే ప్రయత్నం మొదలుపెడుతున్నట్టు భాజపా నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి తాజాగా ట్వీట్ చేయడం ఆసక్తికరం! మోహన్ దాస్, రమేష్, రవిలతో కూడిన తన న్యాయ నిపుణుల బృందం తిరుమల అంశమై కసరత్తు మొదలుపెట్టిందంటూ ఓ ట్వీట్ పెట్టారు. చెన్నైలో జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన ఒక ఫొటో షేర్ చేస్తూ… ఒక పిటీషన్ ను తయారు చేస్తున్నామనీ, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విముక్తం చేయాలని తద్వారా ప్రయత్నిస్తున్నామని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. అంటే, మరోసారి అంశం చర్చనీయం కాబోతోందన్నమాట.
ఇక్కడ గమనించాల్సిన మరో కోణం ఏంటంటే… ప్రస్తుతం తిరుమలను ఏపీ ప్రభుత్వం నుంచి విముక్తం చేసే పనులు చెన్నై నుంచి మొదలుకావడం! సుబ్రహ్మణ్య స్వామితో సహా సదరు న్యాయ నిపుణుల బృంద సభ్యులు కూడా తమిళులే కావడం..! నిజానికి, ఆంధ్రా నుంచి తిరుమలను వేరు చేయాలనే అభిప్రాయం ఆ రాష్ట్రానికి చెందిన కొంతమంది రాజకీయ నాయకులకు ఎప్పట్నుంచో ఉందనే విమర్శలున్నాయి. తాజా పిటీషన్ సుబ్రహ్మణ్య స్వామి నేతృత్వంలో తయారు అవుతూ ఉండటం; తమిళ న్యాయ నిపుణులే కీలక పాత్ర పోషించడం గమనార్హం! ఇదంతా హిందూ ధర్మ పరిరక్షణే అనే కోణంలో సమర్థించుకుంటారేమో..! ఒకవేళ అదే పని చేయాలనుకుంటే… జీర్ణావస్థలో ఉన్న ఎన్నో ఆలయాలు, గోపురాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. వాటిని ఉద్ధరణపై ఈ మాత్రం శ్రద్ధ పెడితే బాగుంటుంది కదా. చక్కగా నడుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంపై ఎందుకింత శ్రద్ధ..? మరీ ముఖ్యంగా ఏపీ సర్కారు నుంచి విముక్తం చేయడం పైనే ఎందుకింత ఆసక్తి…? ఏదేమైనా, ఈ పిటీషన్ మరోసారి వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది.
In Chennai with my legal team of Mohan Das, T.R. Ramesh and R.Ravi (who took the photo) to prepare Writ Petition for freeing the Tirumala TIRUPATI temple from AP Govt clutches pic.twitter.com/I0u0Bqv55h
— Subramanian Swamy (@Swamy39) June 2, 2018