తెలంగాణ ఉద్యమంలో ఆత్మాహుతి ఘటనలు.. ఆత్మహత్య ఘటనలు రేపిన సంచలనం అంతా ఇంతా గాదు. అలాంటి ఘటనలు జరిగినప్పుడు.. ఉద్యమానికి ఆజ్యంలా మారేవి. పెద్ద ఎత్తున నిరసనలు ఎగసిపడేవి. రాజకీయ పార్టీలన్నీ అలాంటి వాటిని బలిదానాలుగా చెప్పేవి. ఉద్యమావేశంతో ఉన్న వారిని అలాంటి ఘటనలు మరింతగా ఉద్రేకపరిచేవి. అయితే అది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం.. రాజకీయాల కోసం కాదు. కానీ ఇప్పుడు.. తెలంగాణలో అదే అత్మాహుతి రాజకీయాల కోసం జరుగుతున్నాయి. రాజకీయపార్టీల నేతల కోసం జరుగుతున్నాయి. ఆ ఆత్మాహుతి ఘటన కేంద్రంగా… రాజకీయ పార్టీలు.. తమదైన రాజకీయం కూడా ప్రారంభించేశాయి.
బీజేపీ ఆఫీసు ముందు శ్రీనివాస్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దానికి కారణం… బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం. పార్టీ కోసం.. పార్టీ నేత కోసం ప్రాణం ఇస్తానంటూ ఆయన పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. శ్రీనివాస్‌కు యాభై శాతం కాలిన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. ఘటన గురించి తెలిసిన వెంటనే.. దుబ్బాక ఎన్నకిల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్న.. భారతీయ జనతా పార్టీ నేతలు వెంటనే.. శ్రీనివాస్‌ను పరామర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా ఆస్పత్రికి వెళ్లారు. ప్రభుత్వంపై మండిపడ్డారు. నిరసనలకు పిలుపునిచ్చారు.
ఈ ఘటన జరిగిన కాసేపటికే మంత్రి కేటీఆర్…మీడియా ముందుకు వచ్చారు. శ్రీనివాస్ ఆత్ముహుతి ఘటన కేంద్రంగా హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తమకు పక్కా సమాచారం ఉందన్నారు. ప్రగతిభవన్, తెలంగాణభవన్, డీజీపీ కార్యాలయాలను ముట్టడించి.. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి.. పోలీసుల కాల్పులకు దారి తీసేలా బీజేపీ చేయబోతోందని కేటీఆర్ అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ కార్యకర్తలకు బండి సంజయ్ చెప్పారంటున్నారు. దీనిపై ప్రత్యేకంగా టీఆర్ఎస్ నేతల బృందం.. డీజీపీకి ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.
కేటీఆర్ ఆరోపణలకు బీజేపీ కూడా వెంటనే కౌంటర్ ఇచ్చింది. శ్రీనివాస్ ఆత్మాహుతి ఘటనపై… తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ కార్యకర్తలపై కాల్పులంటూ జరిగితే.. రాష్ట్రపతి పాలన విధిస్తారని హెచ్చరించారు. కేటీఆర్ బెదిరిస్తున్నరాని.. లక్ష్మణ్, అర్వింద్ మండిపడ్డారు. కేటీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మొత్తానికి టీఆర్ఎస్, బీజేపీ మధ్య భీకరమైన వార్ జరుగుతోందన్నట్లుగా ప్రస్తుతానికి సీన్ క్రియేటయింది. ఇందులోకి.. ఆత్మాహుతి ఘటనలు రావడమే.. రాజకీయాలను మరింత ఉద్రిక్తంగా మారుస్తోంది.