కొన్ని రోజులుగా విజయవాడ వెస్ట్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటమి నేతలకు, ప్రతిపక్ష వైసీపీకి మధ్య జరిగితే ఓకే కానీ… ఒకే కూటమిలో ఉన్న రెండు పార్టీల కీలక నేతల మధ్య పోరు… రోడ్డు మీదకు వస్తోంది. ఒక రకంగా కూటమి పార్టీలకు ఇదో అలర్ట్ మెసెజ్.
అవును… విజయవాడ వెస్ట్ నుండి మాజీ ఎంపీ, బీజేపీ నేత సుజానా చౌదరి కూటమి అభ్యర్థిగా గెలిచారు. ఈ గెలుపులో అన్ని పార్టీల కష్టం ఉంది. క్యాడర్ చెమట ఉంది. గెలిచాక, నేతల మధ్య ఆధిపత్య పోరే ఇప్పుడు క్యాడర్ కు సైతం ఇబ్బందిగా మారింది.
సుజానా చౌదరి గతంలో టీడీపీలో ఉన్న వారే. ఆయనకు మంచి పరిచయాలే ఉన్నాయి. అదే సమయంలో అక్కడ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సైతం అక్కడ కీలక నేతే. వీరిద్దరు సఖ్యతతో ఉంటే ఇబ్బందులు వచ్చేవి కావు. కానీ, బుద్దా వెంకన్న ప్రియారిటీలు, సుజానా చౌదరి ప్రియారిటీలు వేర్వేరు కావటంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఇటీవలే ఇవి బయటకు వచ్చినా… అదేం లేదు అంటూ బుద్ధా వెంకన్నే ఖండించారు. అంతటితో సమస్యకు ఎండ్ కార్డు పడిందని అనుకునే లోపే బుద్ధా వెంకన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : గుడ్ న్యూస్- ప్లాంట్ రీఓపెన్ కు అశోక్ లేలాండ్ ఓకే!
పెత్తనం అంతా ఎమ్మెల్యేలదే నడుస్తోంది. సీఐల ట్రాన్స్ ఫర్స్ అన్ని వారు చెప్పిన వారికే అవుతున్నాయి. పనులు కూడా వారు చెప్తేనే జరుగుతున్నాయి. మరి మేమేం పోరాటం చేయలేదా? టీడీపీ కోసం నాపై 37కేసులయ్యాయి. పోరాటాలు చేశాను. కానీ నా క్యాడర్ ఇప్పుడు కూడా ఇబ్బందిపడుతోంది… వారిని క్షమించాలని కోరుతున్నా అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
నిజానికి కూటమిలో వేర్వేరు పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇవి సహజమే. కానీ, ఇవి పెద్దవి కాక ముందే మొగ్గలోనే తుంచి వేస్తేనే కూటమి ఐక్యమత్యానికి ఇబ్బంది ఉండదు. ఏమాత్రం లైట్ తీసుకున్నా… రాబోయే రోజుల్లో ఇంకా ముదురుతాయి, అధినాయకులకు కూడా ఇబ్బందికరంగా తయారవుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
పిలిచి మాట్లాడుతారో… నియోజకవర్గాల వ్యాప్తంగా నాయకులతో మీటింగ్స్ ఏర్పాటు చేస్తారో… అధినేతల ఇష్టం, కానీ ఆ చర్యలు చేపడితేనే కూటమికి ఇబ్బంది ఉండదన్న చర్చ అన్ని పార్టీల్లోనూ సాగుతోంది.