దాసరి నారాయణ రావు దగ్గర శిష్యరికం చేసి దర్శకులైన వాళ్లు చాలామంది ఉన్నారు. ఓదశలో.. ప్రతి కొత్త డైరెక్టరూ… ఆయన దగ్గర నుంచి వచ్చినవాడే. ఆ తరవాత వర్మ స్కూలు మొదలైంది. వర్మని చూసో, ఆయన దగ్గర పనిచేసో.. దర్శకులైన వాళ్లు కోకొల్లలు. కె.రాఘవేంద్రరావు, వినాయక్.. వీళ్లు కూడా దర్శకుల్ని ప్రొడ్యూస్ చేయగలిగారు. అయితే ఈతరం దర్శకుల నుంచి మాత్రం సరైన స్థాయిలో శిష్యులు రావడం లేదు. రాజమౌళి శిష్యులు దర్శకులైన వాళ్లు చాలా తక్కువ. వాళ్లూ సక్సెస్ అవ్వలేదు. త్రివిక్రమ్ శిష్యులెవరూ దర్శకులైన దాఖలాలు లేవు. బోయపాటి విషయంలోనూ ఇదే జరిగింది. అయితే ఒక్క సుకుమార్ మాత్రం ప్రతీ యేటా తన శిష్యుల్ని రంగంలోకి దింపుతూనే ఉన్నాడు. `ఉప్పెన`తో బుచ్చిబాబు టాప్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్లతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. పల్నాటి ప్రతాప్ కుమార్ కూడా అంతే. తనకీ మంచి అవకాశాలూ వస్తున్నాయి. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల కూడా తొలి సినిమాతోనే తన మార్క్ వేసుకొన్నాడు.
నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాల కోసం సుకుమార్ దగ్గర పని చేశాడు శ్రీకాంత్. ఇప్పుడు దసరాతో దర్శకుడు అయిపోయాడు.తొలిరోజే ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. శ్రీకాంత్ ఓదెలలో మంచి విషయం ఉందన్న సంగతి… అర్థమైపోయింది. ఇప్పుడు శ్రీకాంత్ ఓ హాట్ కేక్. చాలామంది నిర్మాతలు శ్రీకాంత్ కి అడ్వాన్సులు ఇవ్వాలని తిరుగుతున్నారు.కానీ శ్రీకాంత్ మాత్రం ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వలేదు. `దసరా` మేకింగ్ లో, హీరో క్యారెక్టరైజేషన్లో, థీమ్ లో.. రంగస్థలం మార్క్, పోలికలు స్పష్టంగా కనిపించాయి. అంతెందుకు.. రంగస్థలం రిలీజ్ డేట్ (మార్చి 30)నే `దసరా`నీ విడుదల చేశారు. అలా.. గురువు బాటలో నడిచాడు ఈ శిష్యుడు. ఈ విక్టరీలో.. గురువుగా సుకుమార్కీ వాటా ఉంటుంది. ఆయన్నుంచి వచ్చిన వాళ్లంతా వరుసగా హిట్లు కొడుతున్నారు. ఇక మీదట `సుకుమార్ శిష్యులమండీ` అనంటే చాలు.. ఈజీగా ఛాన్సులు దొరికేస్తాయి. అలా ఉంది సుకుమార్ శిష్యుల డిమాండ్.