పుష్పతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు సుకుమార్. ఇప్పుడు తన చేతి నిండా బోలెడు ప్రాజెక్టులు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నాడు సుక్కు. ఆ మాటకొస్తే మరో పదేళ్ల వరకూ సుకుమార్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. పుష్ప కి కనీసం యేడాది టైమ్ పడుతుంది. ఆ తరవాత.. ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఇది కనీసం రెండేళ్ల ప్రాజెక్టు. ఆ వెంటనే రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా ఒకటి ఉంటుంది. `రంగస్థలం` తరవాత చరణ్‌తో చేయాలని సుకుమార్, సుకుమార్ తో చేయాలని చరణ్ గట్టిగా అనుకొన్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. ప్రభాస్ తో సినిమా అవ్వగానే.. చరణ్ రెడీగా ఉంటాడు. ఆ వెంటనే `పుష్ప 3` కూడా ఉంటుందని తెలుస్తోంది. `పుష్ప 3` ఐడియా ఈమధ్యే పుట్టింది. దీనికి సంబంధించిన `లైన్` కూడా బన్నీకి చెప్పేశాడు సుకుమార్. చరణ్, ప్రభాస్, పుష్ప 3… సినిమాకి రెండేళ్లు వేసుకొన్నా… ఈ మూడు సినిమాలకే ఆరేళ్లు పడుతుంది. సినిమా సినిమాకీ మధ్య గ్యాప్‌లు కూడా కలుపుకొంటే… పదేళ్ల వరకూ సుకుమార్ మరే సినిమా చేయడు. ఇంకొన్ని సినిమాలు చేయాలనుకొంటే మాత్రం.. తను స్పీడు పెంచాలి. సినిమాని యేడాది, యేడాదిన్నర లోపు పూర్తి చేయాలి. అలా చేస్తే సుకుమార్ నుంచి మరిన్ని సినిమాలు ఆశించొచ్చు.