మహేష్ బాబు – సుకుమార్ కాంబో గురించి రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా ఆగిపోయిందని, మహర్షి తరవాత వెంటనే అనిల్ రావిపూడి సినిమాని పట్టాలెక్కిస్తాడని టాక్ నడుస్తోంది. సుకుమార్‌కీ, మహేష్‌కి మధ్య అనిల్ రావిపూడి వచ్చిన మాట వాస్తవమే. అయితే.. సుకుమార్ తలుపులు ఇంకా మూసుకుపోలేదు. తనకి ఇంకా ఛాన్సు ఉందని తెలుస్తోంది.
ఇప్పటి వరకూ మహేష్ బాబుకి సుకుమార్ మూడు కథలు వినిపించాడని సమాచారం. అందులో రెండు కథలు మహేష్‌కి ఏమాత్రం నచ్చలేదు. మూడో కథ ఓకే అనిపించి, అందులో కొన్ని మార్పులు చేసుకురమ్మన్నాడని తెలుస్తోంది. అందుకు కొంత సమయం కూడా ఇచ్చాడట. ఈలోగా సుకుమార్ రిపేర్లు చేస్తే సరే, సరి. లేదంటే… అనిల్ రావిపూడి సినిమాని పట్టాలెక్కిస్తాడు. ఈమధ్యే అనిల్ కూడా మహేష్‌కి ఓ కథ వినిపించాడు. ద్వితీయార్థం టేకాఫ్ విషయంలో మహేష్ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తాడని తెలుస్తోంది. దాంతో… అనిల్ కూడా రిపేర్ల పనిలో పడ్డాడు.