కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి..! కాస్త తెలివిగా ఉండకపోతే బిలియన్ల సంపద అయినా హారతి కర్పూరం అయిపోతుంది…! ఇది జరగడానికి తరాలు పట్టాల్సిన పని లేదు. జూదానికి బానిసవ్వాల్సిన అవసరం లేదు…! “అతి” చేసినా అదే పరిస్థితి ఎదురవుతుంది. ఈ విషయాన్ని ఓ అంబానీ నిరూపించారు. గ్రేట్ ధీరూబాయ్ చిన్న కుమారుడు.. అనిల్ అంబానీ.. తనకు ఇప్పుడు చిల్లిగవ్వ లేదని ప్రకటించుకున్నాడు. చేసిన అప్పులు తిరిగి ఇవ్వమని అడుగుతున్న బ్యాంకులకు ఇప్పుడు ఆయన అదే చెబుతున్నాయి.
చిల్లిగవ్వ లేదని భోరున ఏడ్చేస్తున్న అనిల్ అంబానీ..!
అంబానీ అంటే… ఓ బ్రాండ్. సంపదకు చిహ్నం. కుబేరుల కుటుంబమనే ముద్ర. సైకిల్ మీద బట్టలమ్ముకుని.. పెట్రోల్ బంక్‌లో బాయ్‌గా పని చేసి…ప్రపంచ ధనవంతుల్లో ఒకరికిగా ఎదిగి… ఓ సామాన్యుడు ఎంతకైనా ఎదగగలడని నిరూపించిన ధీరూబాయ్ అంబానీ ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు అనిల్ అంబానీ. తీసుకున్న అప్పులు చెల్లించాలంటూ… చైనా బ్యాంకులు బ్రిటన్ కోర్టులో వేసిన పిటిషన్లకు సమాధానం ఇస్తూ.. తన వద్ద చిల్లిగవ్వ లేదని చేతులెత్తేశారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీకి సంబంధించి చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు వ్యక్తిగత హామీ ఇచ్చినందుకు 6 వారాల్లో రూ.700 కోట్లు కోర్టులో డిపాజిట్ చేయాలని బ్రిటన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో అనిల్ అంబానీ బ్రిటన్ కోర్టుకు తన పరిస్థితిని తెలియచేస్తూ.. ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. తన పెట్టుబడుల విలువ కరిగిపోయిందని..తనకు ఉన్న అప్పులను పరిగణనలోకి తీసుకుంటే.. తన సంపద జీరో అని ప్రకటించారు. తన పేరు మీద విక్రయించి సొమ్ము చేసుకోగల ఆస్తులేమీ లేవని చెప్పేశారు.
వేల కోట్ల అప్పుల్లో అనిల్ అడాగ్ గ్రూప్..!
అప్పు ఎగ్గొట్టడానికి అనిల్ అంబానీ ఇలా ప్రకటించాలి… అంబానీ బ్రాండ్ ను దెబ్బతీస్తారని ఎవరూ అనుకోలేరు. నిజంగానే అనిల్ అంబానీ.. దివాలా తీసేసిన పరిస్థితిలో ఉన్నారు. కొద్ది రోజలు క్రితం.. స్వీడన్‌కు చెందిన టెలికం ఉపకరణాల తయారీ సంస్థ ఎరిక్సన్కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేక జైలుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. అప్పుడే అన్న ముఖేష్ అంబానీ.. ఆదుకున్నాడు. ఆర్‌కామ్ చెల్లించాల్సిన రూ.462 కోట్ల మొత్తాన్ని చెల్లించాడు. తమ్ముడు జైలుకు వెళ్లకుండా రక్షించారు. ఆ తర్వాత కూడా.. ఆయనకు సంబంధించిన వివిధ కంపెనీలు తీసుకున్న అప్పుల తాలూకా చిక్కులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆయన దివాలా స్థితికి చేరారని.. పారిశ్రామిక వర్గాలకు క్లారిటీ వచ్చేసింది.
పట్టుబట్టి ఆస్తులు పంచుకుని రోడ్డున పడ్డ అనిల్..!
తండ్రి ధీరూబాయ్ అంబానీ …కుమారులిద్దరూ..కలిసే వ్యాపారాలు చేయాలని ఆశించారు. ఇద్దరూ విడిపోవాలని అనుకోలేదు. కానీ..ఆయన చనిపోయిన తర్వాత… సొంతంగా వ్యాపారం చేసుకోవాలని… అనిల్ అంబానీ ఆరాటపడ్డారు. కానీ ముఖేష్ అంబానీ మాత్రం.. సంయమనం పాటించారు. విడిపోవాల్సిందేనన్న ఉత్సాహంతో.. అనిల్ అంబానీ… కీలకమైన వ్యాపారాల్ని అన్నకు వదిలేశారు. 2005లో విడిపోయారు. రిలయన్స్ బ్రాండ్ ముఖేష్‌కే వదిలేశారు అిల్. ఆయిల్, గ్యాస్ బిజినెస్ ఇచ్చేశారు. అనిల్ ధీరూబాయ్ పేరుతో కొత్త గ్రూప్ ప్రారంభించుకున్నారు. టెలికం వెంచర్, ఇతర ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారాలు అనిల్ అంబానీకి వచ్చాయి. రిలయన్స్ బ్రాండ్‌ను అందుకున్న ముఖేష్.. కొత్త కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టి.. ఘన విజయాలు సాధించారు. తండ్రి వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టారు.కానీ అనిల్ మాత్రం..అన్ని వ్యాపారాలను పడుకోబెట్టారు. ఒక్కటంటే.. ఒక్క దాంట్లోనూ లాభం కళ్లజూడలేదు. అప్పుల పాలై దివాలా స్థితికి చేరుకున్నారు.
బ్రదర్స్.. ఒకరు ఆకాశంలో..మరొకరు పాతాళంలో..!
అన్నతో విడిపోవాలనుకున్నప్పుడు… హితులు..సన్నిహితులు అందరూ… చెప్పి చూశారు. విడిపోవడం శ్రేయస్కరం కాదని. కానీ అనిల్ ఒప్పుకోలేదు. స్వయంగా తల్లి కోకిలాబెన్ కూడా…చెప్పి చూసినా.. అంగీకరించలేదు. చివరికి.. అతి స్వల్ప కాలంలోనే… అనిల్ .. సంపద మొత్తాన్ని కోల్పోయారు. అదే సమయంలో.. ముఖేష్ అంబానీ మాత్రం… అపర కుబేరుడిగా అవతరించారు. విడిపోయినప్పుడు.. ఇద్దరికీ సమానంగానే ఆస్తులు వచ్చాయి. పదిహేనేళ్ల తర్వాత ఇద్దరి వైపు చూస్తే.. ఒకరు ఆకాశంలో..మరొకరు పాతాళంలో ఉన్నారు.