‘సింగిల్ టేక్ ఆర్టిస్ట్’ అనే మాట ఇండస్ట్రీలో తరచూ వినిపిస్తుంటుంది. కాస్త అనుభవం ఉన్న నటీనటులు రెండో టేక్ ఓకే చేసేస్తారు. దర్శకుడు మరీ పర్ఫెక్షనిస్ట్ అయితే మరో రెండు మూడు టేకులు ఎక్కువ తీసుకొంటారు. అయితే… పది, పన్నెండు, పదిహేను… ఇలా టేకుల మీద టేకులు తీసుకొంటూ, ఇరిటేషన్ తెప్పించే సందర్భాలు కూడా ఉంటాయి. సందీప్ కిషన్ కు అలాంటి సన్నివేశమే ఎదురైంది. 11 సెకన్ల అతి చిన్న షాట్ కోసం.. ఏకంగా 16 టేకులు తీసుకొన్నాడట. ఈ విషయం తనే చెప్పాడు.
ధనుష్ నటించిన చిత్రం ‘రాయన్’. ఈనెల 25న విడుదల కానుంది. ఇందులో సందీప్ కిషన్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాలోని ఓ సీన్ కోసం తను 16 టేకులు తీసుకొన్నట్టు సందీప్ చెప్పాడు. ఆసమయంలో తాను చాలా టెన్షన్ పడ్డానని, అయితే అదే సీన్ కోసం మిగిలిన ఆర్టిస్టులు కూడా టేకుల మీద టేకులు తీసుకోవడంతో… కాస్త ఉపశమనం లభించిందని సరదాగా వ్యాఖ్యానించాడు. ధనుష్ తన తప్పొప్పుల్ని సరి చేశాడని, న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో కూడా చెప్పని కిటుకులు ధనుష్ చెప్పాడని, మళ్లీ తన జీవితంలో ఇలాంటి అవకాశం రాదని చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్. ‘రాయన్’లో నటించమని ధనుష్ తనని సంప్రదించినప్పుడే పెద్ద అవార్డు దక్కిందన్న ఫీలింగ్ వచ్చిందని, తన కాస్ట్యూమ్స్ ధనుష్ స్వయంగా సెలెక్ట్ చేశాడని, హెయిర్ స్టైల్ తనే డిజైన్ చేశాడని పేర్కొన్నాడు సందీప్.