మహేశ్ బాబు సోదరి మంజుల దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’తో సందీప్ కిషన్ ఖాతాలో మరో ప్లాప్ చేరింది. ఫ్లాపుల మీద ఫ్లాపులతో హిట్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న ఈ హీరో అందుకోసం ఒక తమిళ్ సినిమా రీమేక్ మీద ఆధారపడ్డాడని సమాచారమ్. తమిళంలో మంచి విజయం సాధించిన ‘ఇంద్రు నేత్రు నాళై’ తెలుగు రీమేక్‌లో నటించే ఆలోచనలో వున్నాడట. అన్నీ కుదిరితే ఈ సినిమాతో శ్రీరామ్ అనే కొత్త దర్శకుణ్ణి పరిచయం చేయాలనుకుంటున్నాడు. తమిళ్ రీమేకుల్లో నటించడం సందీప్‌కి కొత్తేమీ కాదు. ఆల్రెడీ ‘నేరమ్’ను తెలుగులో ‘రన్’గా రీమేక్ చేశాడు. అది ప్లాప్ అయ్యింది. ఇప్పుడీ ‘ఇంద్రు నేత్రు నాళై’తో హిట్ దక్కుతుందో? లేదో? ప్రస్తుతం ఈ హీరో చేతిలో ఒక్క సినిమా మాత్రమే వుంది. అదీ మల్టీస్టారర్. ‘డి16: ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్’ ఫేమ్ కార్తీక్ నరేన్ దర్శకత్వంలో అరవింద్ స్వామి, శ్రియ తదితరులతో కలిసి ‘నగరసూరన్’ చేస్తున్నాడు. తెలుగులో ‘నరకాసురుడు’ పేరుతో అది విడుదల కానుంది.