ఆంధ్రా, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న హైదరాబాద్ లోని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఇవ్వాళ్ళ సుప్రీంకోర్టులో ఉపశమనం దొరికింది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు కోరిన కాల్ డాటాను సీల్డ్ కవర్లో ఉంచి వారం రోజుల్లోగా విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకి ఇవ్వవలసిందిగా సుప్రీంకోర్టు వారిని ఆదేశించింది. కానీ దానిని మూడు వారాల వరకు కోర్టు వారు కూడా తెరవరాదని, నాలుగు వారాల తరువాతనే సిట్ అధికారులకు ఆ వివరాల ఆధారంగా దర్యాప్తు చేసేందుకు అనుమతించవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇంతకు ముందు విజయవాడ కోర్టులో హాజరయిన మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు తాము కాల్ డాటా వివరాలను ఎవరికయినా ఇచ్చినట్లయితే తెలంగాణా ప్రభుత్వం తమను ప్రాసిక్యూట్ చేస్తానని హెచ్చరించిందని కనుక కోర్టు అడిగినట్లు కాల్ డాటా ఇవ్వలేమని తమ నిస్సహాయతను తెలియజేసారు. కానీ ఈ నెల 24వ తేదీలోగా తప్పనిసరిగా తమకు కాల్ డాటాను అందించాల్సిందేనని లేకుంటే కోర్టు ధిక్కార నేరం క్రింద చర్యలు చేప్పట్టవలసి వస్తుందని విజయవాడ కోర్టు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లను హెచ్చరించింది. దానితో పునరాలోచనలో పడిన మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఏమిచేయాలో పాలుపోక సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
వారికి సుప్రీం అభయం ఇవ్వడంతో ఇక నిర్భయంగా కాల్ డాటాను విజయవాడ కోర్టుకి అందించవచ్చును. బహుశః ఆ కాల్ డాటా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చేతికి చిక్కితే తమ ప్రభుత్వానికి కూడా ఊహించని సమస్యలు ఎదురవుతాయనే భయంతోనే తెలంగాణా ప్రభుత్వం మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లను ఆ విధంగా హెచ్చరించి ఉండవచ్చును. అదే నిజమయితే, వారు అందించబోయే కాల్ డాటాలో ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబందించి చాలా కీలకమయిన ఆధారాలు లభించే అవకాశం ఉంది.
కానీ ఓటుకి నోటు వ్యవహారం బయటపడినప్పుడు “చంద్రబాబు నాయుడుని ఇక ఆ బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు. జైలుకి వెళ్ళక తప్పదు” అని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా చాలా మంది మంత్రులు ఏకగ్రీవ ప్రకటన చేసారు. కానీ ఇంచుమించు రెండు నెలలు పూర్తి కావస్తున్నా చంద్రబాబు నాయుడుకి నోటీసులు కూడా పంపలేకపోయారు. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని కొన్నిరోజులు సాగదీయవచ్చును. ఒకవేళ ఓటుకి నోటు కేసులో తెలంగాణా ప్రభుత్వం ఒక అడుగుముందుకు వేస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరొకడుగు ముందుకు వేయవచ్చును. కానీ ఇప్పుడు ఒకరి పిలక మరొకరి చేతిలో ఉన్నందున రెండు ప్రభుత్వాలు కూడా ఈ కేసులను మరికొంత కాలం సాగదీసి అటకెక్కించవచ్చును. మరోవిధంగా చెప్పాలంటే ఒకదానినొకటి బ్లాక్ మెయిలింగ్ చేసుకొంటున్నాయన్న మాట!