వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ.. ఓ కమిటీని నియమించడం.. ఆ కమిటీలో అందరూ వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా మాట్లాడిన వారే ఉండటం వివాదాస్పదమవుతోంది. స్పష్టమైన అభిప్రాయంతో ఉన్న వారితో నియమించిన కమిటీ.. ఎలాంటి నివేదిక వస్తుందో అంచనా వేయడం కష్టం కాదని.. రైతుల అభ్యంతరాలకు వారు ఎలా పరిష్కారం చూపగలరన్న చర్చ దేశవ్యాప్తంగా నడుస్తోంది. ఈ కమిటీలో సభ్యులను ప్రకటించిన వెంటనే రైతు సంఘాలు తీవ్రంగా స్పందించాయి. అంగీకరించే సమస్యే లేదని తేల్చి చెప్పాయి.
అనిల్ ఘన్వాట్, అశోక్ గులాటి, భూపీందర్‌సింగ్ మాన్, ప్రమోద్ కుమార్ జోషిలతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు ప్రకటించారు. వీరు నలుగురూ.. వ్యవసాయంతో సంబంధం ఉన్న వారే. రైతుల కోసం ఉద్యమాలు నిర్వహించిన వారు కూడా ఉన్నారు. రైతు ఉద్యమకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు. అయితే… అసలు చిక్కు అంతా.. వీరు ఇప్పటికే అభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్లే వస్తోంది. రైతుల ఆందోళనలు ప్రారంభమైన తర్వాత వీరందరూ పెద్దఎత్తున వివిధ పత్రికలకు వ్యాసాలు రాశారు. అందులో రైతుల ఆందోళనలను కొట్టి పారేసి.. చట్టాలను సమర్థించారు. కొత్త చట్టాలను ఏమాత్రం బలహీనపర్చినా భారత వ్యవసాయరంగం తన ముందున్న అంతర్జాతీయ అవకాశాలను దెబ్బతీసుకుంటున్నట్లే అవుతుందన్న బలమైన వాదన వినిపించారు.
ఇంత స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేసిన సభ్యులు రైతుల అభిప్రాయాలను తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది. వారి ఆందోళనలను కొట్టి పడేసి.. సుప్రీంకోర్టుకు అనుకూలంగా నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు సుప్రీంకోర్టు కూడా అధికారికంగా ఆమోద ముద్ర వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే రైతులు.. ఈ కమిటీని వ్యతిరేకిస్తున్నారు. వారంతా చట్టాలకు రాతపూర్వకంగా మద్దతు పలికారు. వారి ద్వారా న్యాయం జరుగుతుందని నిరసనకారులు ఎలా ఆశించగలరని ఉద్యమనేతలు ప్రశ్నిస్తున్నారు.
కొసమెరుపేమిటంటే… కేంద్రం చేసిన చట్టాలు… రాష్ట్రపతి సంతకం చేసిన చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఎలా విధిస్తుందన్న చర్చ జరుగుతోంది. అలాంటి అధికారం సుప్రీంకోర్టుకు లేదని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో కేంద్రం కూడా పట్టింపునకు పోవడంలేదు. ఆమోదయోగ్యమే అంటోంది. బహుశా… సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వల్ల అంతా మంచే జరుగుతుందని… కేంద్రం బలంగా నమ్ముతున్నట్లుగా ఉందని చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఫైనల్ చేస్తే రైతులు నెమ్మదిస్తారని.. తిరుగుండదని అనుకుంటున్నట్లుగా అంచనా వేస్తున్నారు.