జగన్ అక్రమాస్తుల కేసుపై జరుగుతోన్న కాలయాపనపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సీబీఐ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. సీబీఐ దాఖలు చేసిన ఆఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసులను తెలంగాణలో కాకుండా మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని అలాగే, జగన్ బెయిల్ రద్దు చేసి విచారణలో వేగం పెంచాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐపై అసహనం వ్యక్తం చేసింది.
మే 2న సీబీఐ దాఖలు చేసిన ఆఫిడవిట్ లోని అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని జస్టిస్ ఖన్నా వ్యాఖ్యానించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పు అనేలా కాలయాపన చేస్తున్నారన్నారు. ట్రయల్స్ ముందుకు సాగకుండా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని.. ఇదే విచారణలో జాప్యానికి కారణం అవుతుందని సీబీఐ వాదించింది.
సీబీఐ వాదనలపై జస్టిస్ సంజీవ్ ఖన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లను విచారించి డిశ్చార్జ్ చేస్తున్నామని అయినా తమకు లేని అడ్డంకి మీకు ఎలా వస్తుందని ప్రశ్నించారు. సీబీఐ తరఫున ఏఎస్జీ రాజు అందుబాటులో లేకపోవడంతో ఆయనను వెంటనే వాదనలు వినిపించేందుకు రప్పించాలంటూ విచారణకు మధ్యాహ్నంకు వాయిదా వేసింది.