రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయాలను వాడుకునే క్రమంలో… ఓ తెలుగు ఆఫీసర్ ను బలి పశువును చేసేశారు. సీబీఐలో చెలరేగిన అంతర్యుద్ధంలో.. తాత్కాలిక సీబీఐ డైరక్టర్ గా … మన్నెం నాగేశ్వరరావును నియమించారు. అర్ధరాత్రి పూట… అప్పట్లో డైరక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరక్టర్ రాకేష్ ఆస్తానాలను తొలగించి… తాత్కాలికంగా మన్నెం నాగేశ్వరరావుకు పట్టం కట్టారు. ఆయన అర్థరాత్రి చార్జ్ తీసుకుని.. తెల్ల వారే సరి కల్లా.. ఇష్టం వచ్చినట్లు.. అధికారుల్ని ట్రాన్స్ ఫర్ చేసి పడేశారు. అప్పట్లో.. రఫెల్ స్కాంపై.. డైరక్టర్ గా ఉన్న అలోక్ వర్మ విచారణ జరుపుతారన్న భయంతో.. ఆయనను పంపించేశారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో.. అనేక మంది సీబీఐ అధికారుల్ని.. అండమాన్ వరకూ బదిలీ చేశారు. ఈ బదిలీలు అధికారికంగా చేసింది తాత్కలికంగా నియమితులైన డైరక్టర్ మన్నెం నాగేశ్వరరావు కావొచ్చు కానీ.. అసలు చేయించింది.. వెనుకన్న అదృశ్యశక్తులే. అలాంటి వారిలో.. జాతీయ భద్రతా సలహాదరు అజిత్ ధోవల్ కీలకం.
ఇలా బదిలీ చేసిన అధికారుల్లో.. ముజరఫర్ పూర్ సీబీఐ అధికారి కూడా ఉన్నారు. ఆయన బీహార్ అధికార పార్టీకి చెందిన ఓ నేత… చిన్న పిల్లలను.. లైంగికంగా వేధించిన కేసులో దర్యాప్తు చేస్తున్నారు. ఆయనను బదిలీ చేయవద్దని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ బదిలీ చేసేశారు. దీనిపై సుప్రీంకోర్టు మండి పడింది. మన్నెం నాగేశ్వరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు నిర్ధారించింది. తనకు తెలియకుండానే… కోర్టు ధిక్కరణకు పాల్పడ్డానని.. క్షమించాలని మన్నెం వేడుకున్నా.. సుప్రీంకోర్టు అంగీకరించలేదు. నాగేశ్వరరావుకు రూ.లక్ష జరిమానా విధించింది. సాయంత్రం వరకూ.. కోర్టులోనే ఓ మూల కూర్చోవాలని ఆదేశించింది.
మన్నెం నాగేశ్వరరావు కేవలం కీలబొమ్మ మాత్రమే. అయినప్పటికీ.. ఆయన బలి పశువు అయ్యారు. సీబీఐలో మొత్తం వ్యవహారాలు అజిత్ ధోవల్ చూస్తూంటారని.. దేశం మొత్తానికి తెలిసిన విషయం. కానీ.. తాత్కాలికంగా ఓ తెలుగు వాడికి పదవి ఇచ్చి.. ఆయనను సుప్రీంకోర్టు ముందు.. దోషిగా నిలబెట్టి.. తమకు కావాల్సిన ప్రయోజనాలను తాము పొందారు… అధికార పార్టీ నేతలు. ఇప్పుడు ఏ ఐపీఎస్ అధికారి ఖాతాలో పడిన రిమార్క్ మన్నెం నాగేశ్వరరావు ఖాతాలో పడింది.