ఓటుకు నోటు కేసును తెలంగాణ హైకోర్టు నుంచి మధ్య ప్రదేశ్ కు బదిలీ చేయాలన్న పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయాలను న్యాయస్థానానికి ఆపాదించడమంటే న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని జస్టిస్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
అయితే, ఈ కేసులో నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారని, పైగా దర్యాప్తు సంస్థ ఏసీబీ ఆయన వద్దే ఉందని పిటిషన్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కేసును మీరు కోరుకున్నట్లుగా బదిలీ చేస్తే సంబంధిత కోర్టుకు రాజకీయాలు ఆపాదించినట్లే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ధర్మాసనం సీరియస్ అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులకు రాజకీయాలు అపాదిస్తారా.? అని సీరియస్ అయింది. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడుతారా? మేం రాజకీయ పార్టీలను సంప్రదించి తీర్పునిచ్చామా అని ప్రశ్నించింది.
తదుపరి విచారణను కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.