అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఆరు నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కానీ అమరావతిపై చట్టం చేసే అధికారం లేదంటూ.. ఇచ్చిన మాండమస్ పై మాత్రం స్టే ఇచ్చేందుకు అంగీకరించలేదు. తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేస్తూ.. కేంద్రంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వానికి ఒక్క విషయంలోనే రీలీఫ్ లభించింది. హైకోర్టు తీర్పు ఇచ్చినా నిర్మాణాలు చేయడం లేదంటూ… రైతులు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ నుంచి తప్పించుకోవచ్చు. కానీ మూడు రాజధానులపై చట్టాలు చేయడం కానీ.. రాజధానిని తరలించడం కానీ చేయలేరు.
నిజానికి హైకోర్టు తీర్పు ఇచ్చినా ఇంత వరకూ అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీనిపై రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎలాగైనా సుప్రీంకోర్టులో తీర్పుపై స్టే తెచ్చుకుని మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. పలువురు సీనియర్ లాయర్లను నియమించుకున్నారు. కానీ మాండమస్ అంశంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్రంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇందులో కనీసం నాలుగు వందల మంది ప్రతివాదులుంటారు. వారందరి వాదనలు వినాల్సి ఉంది. దీని వల్ల కేసు విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాజధానిని నిర్ణయించుకునే చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి చెప్పడం సరి కాదని … అమరావతిగా రాజధానిని తరలించడం లేదని.. అమరావతిలో లేజిస్లేటివ్ రాజధాని ఉంటుందని..రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్టం ప్రకారం ఇప్పటికీ అమరావతినే రాజధానిగా ఉందన్నారు. రాజధాని విషయంలో చట్టం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. రైతుల తరపు లాయర్ 29 వేల మందిరైతులు తమ బతుకు దెరువు అయిన భూమిని రాజధానికి ఇచ్చారన్నారు. కానీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ఉల్లంగిస్తున్నారని.. 2019 నుంచి ఎలాంటి నిర్మాణాలు చేయడం లేదన్నారు.
వాదనలు జరుగుతున్న సమయంలో బెంచ్‌లో ఉన్న జస్టిస్ నాగరత్న ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని.. హైకోర్టు ఎలా చెబుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు సిటీ ప్లానర్‌గా మారుతుందా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది.. మాండమస్ అంశంపై స్టే ఇవ్వాలని కోరినా ఫలితం దక్కలేదు.