మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల రోజు పోలింగ్ సెంటర్ లో పిన్నెల్లి సృష్టించిన విధ్వంసం, మాచర్ల అల్లర్ల తర్వాత వరుసగా కేసులు నమోదుకావటంతో ముందస్తు బెయిల్ పొంది పిన్నెల్లి బయటకు వచ్చారు.
అయితే, పోలింగ్ రోజు పిన్నెల్లి అక్కడే ఉన్న టీడీపీ ఏజెంట్ ను బెదిరిస్తూ… ఈవీఎంను ధ్వంసం చేసినా కూడా ముందస్తు బెయిల్ వచ్చిందని, ఆ బెయిల్ రద్దు చేయాలని టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఈ కేసును విచారించింది.
విచారణ సందర్భంగా పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో న్యాయమూర్తి ముందుంచారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బెంచ్… పిన్నెల్లిని కౌంటర్ కేంద్రంలోకి అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఈనెల 6న హైకోర్టులో విచారణ ఉన్నందున, మెరిట్స్ ప్రకారం విచారణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని హైకోర్టుకు సూచించింది. అయితే, ఆ వీడియో ఎన్నికల సంఘం విడుదల చేసిన వీడియో కాదని వైసీపీ తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తెచ్చినా… సుప్రీంకోర్టు ఆంక్షలను విధిస్తూనే నిర్ణయం తీసుకోవటం విశేషం.
ఇక, సుప్రీంకోర్టు ఆంక్షలపై అప్పీల్ కు పిన్నెల్లికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సుప్రీంకోర్టుకు ప్రస్తుతం సెలవులున్నాయి. కేవలం వెకేషన్ బెంచ్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, అత్యవసర పిటిషన్ దాఖలు చేస్తే… విచారణకు వస్తుందా? వస్తే ఆంక్షల సడలింపు ఉంటుందా? అన్నది తేలాల్సి ఉంది.