పెగాసస్ నిఘా వ్యవహారంపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టు ప్రాథమికంగా నిర్ణయించింది. ఓ కేసు విచారణ సందర్బంగా సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చేవారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. పెగాసస్ నిఘా వ్యవాహరంలో స్పష్టమైన అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో సుప్రీంకోర్టు తామే ఓ కమిటీ వేయాలని నిర్ణయించుకుంది. కొంత మంది సాంకేతిక నిపుణులను కూడా ఎంపిక చేసినా వారు కమిటీలో ఉండేందుకు సిద్ధపడలేదు. దీంతో కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. త్వరలో సభ్యులను ఖరారు చేస్తామన్నారు.
పెగాసస్ నిఘా వ్యవహారంలో విచారణ జరిపించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కోర్టు ఆదేశిస్తే నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తామని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఫోన్లపై నిఘా ఉంచడానికి పెగాసస్ కానీ, ఇతరత్రా ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఉపయోగిస్తోందా? లేదా? అని ఖరారుగా చెప్పేందుకు కేంద్రం సిద్ధపడలేదు. దేశ భద్రత అంశాన్ని తెరపైకి తెచ్చింది. అయితే దేశ భద్రత అంశాలను చెప్పాలని తాము అడగట్లేదని.. చట్టప్రకారం అనుమతించే మార్గాల్లో కాకుండా, ఇతర మార్గాల్లో నిఘా సాఫ్ట్వేర్ ఉపయోగించారా? లేదా? అన్నది తెలుసుకోవాలనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కేంద్రానికి పలు మార్లు చాన్సులిచ్చినా స్పందించకపోవడంతో కమిటీ వేయాలని నిర్ణయించుకుంది. ఈ అంశం పార్లమెంట్ సమావేశాల్లో కూడా దుమారం రేపింది. సమావేశాలు సజావుగా సాగలేదు. ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతలు.. న్యాయమూర్తులపై కూడా నిఘా పెట్టారన్న ప్రచారం సాగడంతో విచారణ జరిపించాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.