ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణ ఎవరికి ఉండాలనే విషయంలో స్థానిక ఆప్ సర్కార్ కి, కేంద్రానికి నడుస్తున్న వివాదం కొలిక్కివచ్చింది. స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలు ఉండాలని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవన్న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. 2019 నాటి సింగిల్ జడ్జి తీర్పుతో ఏకీభవించబోమని స్పష్టం చేసింది. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలకే నిజమైన అధికారాలు ఉంటాయని పేర్కొంది.
లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతి భద్రతలు, భూ వ్యవహారాలపై మాత్రమే కేంద్రానికి అధికారం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు సీజేఐ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇదే అంశంపై స్పష్టమైన తీర్పు వెలువరించింది. దీంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ అసలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేసి ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రశ్నార్థం చేసిన వ్యవహారంపై ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రావడమే నిజంగా విషాదం.
కేజ్రీవాల్ వరుసగా ఢిల్లీలో సీఎం అవుతున్నారు. రాజకీయంగా బీజేపీని సవాల్ చేస్తున్నారు. అందుకే బీజేపీ.. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రాజకీయం ప్రారంభించింది. కేజ్రీవాల్ సర్కార్ అధికారాలను పరిమితం చేస్తూ.. రాజకీయం చేింది. ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అధికారాల విషయంలో స్పష్టత కరవై తరచూ వివాదాలు తలెత్తాయి. సింగిల్ జడ్జి లెఫ్టినెంట్ గవర్నర్ కే అధికారాలు ఉంటాయని తీర్పు ఇచ్చారు. నిజానికి ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమే . పూర్తి రాష్ట్ర హోదా లేదు. కానీ అక్కడ ప్రజాప్రభుత్వం ఉంది. దేశ రాజధాని కాబట్టి భద్రతావసరాలు పోలీసు వ్యవస్థ మాత్రమే కేంద్రం చేతుల్లో ఉంటుంది. మిగతా అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అధికారి. కానీ ఆ అధికారం లాక్కోవడానికి చేయని ప్రయత్నాలే లేవు.