సురేష్ బాబు పక్కా బిజినెస్ మేన్. రామానాయుడు మనసుతో ఆలోచిస్తే.. ఆయన తనయుడు సురేష్ బాబు బుర్రతో ఆలోచిస్తారని.. ఈ కుటుంబం గురించి బాగా తెలిసినవాళ్లు చెబుతుంటారు. అది నిజం కూడా. సురేష్ బాబు ఏదైనా సరే, వ్యాపారం కోణంలోనే ఆలోచిస్తుంటారు. రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులొస్తాయి? వాటికి తగ్గట్టుగా ఎలా మలచుకోవాలి? అనే విషయాలపైనే ఆయన ఫోకస్ ఉంటుంది. సురేష్ బాబు మనసు.. సినిమాల నుంచి వేరే వేరే వ్యాపారాలవైపు వెళ్తోంది, వ్యవసాయం వైపు ఆయన దృష్టి పెడుతున్నారని, క్రమంగా నిర్మాణ రంగానికి దూరం అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని నానక్ రామ్ స్టూడియోని కూడా ఆయన డెవలెప్మెంట్ కి ఇచ్చారు. అక్కడ అపార్ట్మెంట్లు వెలవబోతున్నాయని తెలిసింది. వీటిపై సురేష్‌బాబు స్పందించారు.
”నానక్ రామ్ గూడాని డవలప్మెంట్ కి ఇచ్చిన సంగతి నిజమే. అయితే నానక్‌రామ్ గూడా స్టూడియోని వదులకున్నానంటే అర్థం.. అంతకంటే పెద్ద స్టూడియో నిర్మిస్తాననే. స్టూడియోలకు గత వైభవం రావాలి. హాలీవుడ్లో స్టూడియోలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అలాంటి వాతావరణం మనకూ రావాలి. హైదరాబాద్, విశాఖ, అమరావతి.. ఇలా మూడు చోట్లా స్టూడియోలు నిర్మిస్తా. వ్యవసాయం అంటారా.. అది నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో ఆ పనులు చూసుకుంటా. రానాకి నిర్మాణ రంగం అంటే నాకంటే ఎక్కువ ప్యాషన్. తను సినిమాని వదలడు. మా కుటుంబం సినిమాకి ఎప్పటికీ దూరం కాదు” అని చెప్పుకొచ్చారు. విశాఖలో రామానాయుడు స్టూడియో ఉంది. ఇక.. అమరావతిలో స్టూడియో కట్టాలి. సో.. సురేష్ బాబు ఆ ప్రయత్నాల్లో ఉన్నారన్నమాట.