ET Movie Review
తెలుగు360 రేటింగ్ : 2/5
సూర్య సినిమాలంటే ముందు నుంచీ ఓ గౌరవం ఉంది. దాన్ని కాపాడుకుంటూ రావడానికి సూర్య కూడా శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆమధ్య సూర్య సినిమాలన్నీ ఫ్లాపులే. తను కూడా మూస పద్ధతిలో పడిపోవడంతో, సూర్య సినిమాలు ప్రేక్షకులకు చేరువ కావడం లేదు. అయితే `ఆకాశమే నీ హద్దురా`, `జై భీమ్` సినిమాలతో సూర్య మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. `జై భీమ్` అయితే నటుడిగా తన గౌరవాన్ని పెంపొందించింది. సూర్య మాత్రమే చేయదగిన సినిమాగా విశ్లేషకులు ఆ చిత్రాన్ని నెత్తిన పెట్టుకున్నారు. అందుకే ఇప్పుడు విడుదలైన `ఈటీ` (ఎవరికీ తలవంచడు) సినిమాపై కూడా నమ్మకాలు పెరిగాయి. ఈసారీ.. తనేదో మ్యాజిక్ చేస్తాడనిపించింది. మరి `ఈటీ` ఎలా ఉంది? సూర్య ఈసారి ఏం చేశాడు?
పక్క పక్కనే ఉండే రెండు ఊర్లవి. ఆడపిల్లలకు ఎనలేని గౌరవం ఇస్తారు. అమ్మాయి పుడితే పండగే. 111 మొక్కల్ని నాటుతారు. ప్రతీ యేటా.. ఉత్సవం చేస్తారు. పెళ్లి చేసి పక్క ఊరికి పంపిన అమ్మాయిల్ని, పుట్టింటికి తీసుకొచ్చి పండగ చేస్తారు. అంత సఖ్యతగా ఉండే ఈ రెండు ఊర్ల మధ్య ఓ గొడవ. అది చినికి చినికి గాలివానగా మారుతుంది. రెండు ఊర్లూ సంబంధాలు కలుపుకోవడానికి ఇష్టపడరు. దానికి తోడు…ఊర్లో అమ్మాయిల్లో కొంతమంది వరుసగా చనిపోతుంటారు. వీటన్నింటికీ కారణం ఎవరు? ఆ ఊర్లో అమ్మాయిల విషయంలో ఏం జరుగుతుంది? అనేది హీరో ఎలా చేధించాడు? ఆ అమ్మాయిల కోసం ఏం చేశాడు? అనేదే కథ.
చెడుపై మంచి గెలవడం. ఏ సినిమా తీసుకున్నా ఇదే కాన్సెప్ట్. ఇందులోనూ అంతే. కాకపోతే.. ఇక్కడ హీరో సూర్య, దర్శకుడు పాండిరాజ్. ఇద్దరి ఇమేజ్‌లూ వేరు. సూర్య మాస్ అయితే, పాండిరాజ్ ఫ్యామిలీ డైరెక్టర్. అందుకే సూర్య కోసం మాస్ కథనే రాసుకుంటూ, అందులోనే తన ఫ్యామిలీ డ్రామా ఇరికించాలని చూశాడు. అయితే ఈ అతుకుల బేరం కుదర్లేదు. హీరో ఫ్యామిలీ సీన్లు, అమ్మతో హీరోకున్న అటాచ్ మెంట్, హీరోయిన్ తో లవ్ ట్రాక్… ఇవన్నీ పరమ రొటీన్ గా కనిపిస్తాయి.ఓ దశలో చాలా ఓవర్ అనిపిస్తాయి. హీరో అమ్మ…. శరణ్య హీరోకి మాటి మాటికీ ఫోన్ చేసి, `భోం చేశావా, నీళ్లు తావాగా.. జుజ్జు కెళ్లావా` అని అడగడం… కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. `నీ కూతుర్ని ఎత్తుకెళ్లిపోతా చూడండి..` అని చెప్పి, దాని చుట్టూ నడిపిన సన్నివేశాలన్నీ చాలా ల్యాగ్‌తో సాగాయి. ఆయా సన్నివేశాల్లో నటీనటుల ఓవర్ యాక్షన్… అరవ అతిశయానికి నిలువుటద్దంలా కనిపిస్తుంది.
అసలు కథంతా ద్వితీయార్థంలోనే. ఈ కథలో సంఘర్షణ చూపించే అవకాశం అక్కడే దొరికింది. అయితే అదేం బలమైన పాయింట్ కాదు.చాలా సినిమాల్లో చూసిందే. అమ్మాయిల్ని ప్రేమ పేరుతో లోబరచుకుని, వాళ్లని లొంగదీసుకుని, ఆ వీడియోని ఇంటర్నెట్ లో పెడతామని బెదిరించడం.. అనేది ఎప్పటి కాన్సెప్ట్. సెకండాఫ్ అంతా ఇదే తంతు. అమ్మాయిల్ని కాపాడడానికి, వాళ్ల మానాన్ని రక్షించడానికి హీరో పోరాడుతుంటాడు. అయితే తనక్కూడా ఓ బ్యాక్ స్టోరీ ఉండాలి అనుకోవడం ఎందుకో అర్థం కాదు. అందుకోసం ఐదేళ్ల తన చెల్లాయిపై బలత్కారం చేశారంటూ.. ఫ్లాష్ బ్యాక్‌లో చెప్పాడు. ఇదంతా అవసరమా? ఐదేళ్ల పిల్లలపై కూడా అరాచకంగా ప్రవర్తించేవాళ్లు ఉన్నారు. అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అలాగని అలాంటివి స్క్కీన్ పై చూడడం, చూపించడం ఎంత వరకూ కరెక్ట్. క్లైమాక్స్ లో కూడా సాగదీతే. హీరో ఓ అన్యాయాన్ని ఎదుర్కోడానికి న్యాయ శాస్త్రాన్ని పక్కన పెట్టి, ఆయుధాన్ని అందుకున్నాడని చూపించారు. `జై భీమ్`లో రాజ్యాంగంతో, న్యాయంతో… ఓ బలమైన సామాజిక యుద్ధంలో గెలిచిన హీరో, `ఈటీ`లో తన ఫార్ములానే రివర్స్ చేయడం కాకతాళియమే అయినా, ఎందుకో.. మనసొప్పుకోదు.
రొటీన్ కథలు ఎంచుకోవద్దనిచెప్పడం లేదు. కానీ మ్యాజిక్ ఎక్కడో ఓ చోట చేయాలి. సూర్య ఈ సినిమా చేశాడంటే.. అలాంటి మ్యాజిక్ ఆశించడంలో తప్పులేదు. కానీ.. పాండిరాజ్ అది చేయలేకపోయాడు. కొన్ని వాస్తవ సంఘటల్ని తెరపై చూపించాలనుకోవడంలో ఎలాంటి సమస్య లేదు. కాకపోతే… దాన్ని జనరంజకంగా మలచాలి. కత్తి పడితే గానీ, యుద్ధం పూర్తవదు అనుకుంటే, హీరోతో ఎప్పుడో కత్తిపట్టించాల్సింది. మరి ఈ సినిమాతో ఏం చెప్పదలచినట్టు..?
సినిమా మొత్తంలో ఓ పాయింట్ అయితే బాగా నచ్చుతుంది. అమ్మాయిల నగ్న వీడియోలు వచ్చినప్పుడు… అందా దాన్ని చూసి లైకులు కొడతారు. కామెంట్లు, షేర్లూ చేస్తారు. కానీ…`దాన్ని డిలీట్ చేయొచ్చు కదా` అని ఒక్కడూ అనడు. `ఇలాంటి పరిస్థితుల్లో నా చెల్లో, అక్కో ఉంటే` అని ఒక్కడూ ఆలోచించడు. తీసిన వాడ్ని తిట్టుకోరు. వాడికి ఎలాంటి పనిష్మెంట్ ఉండదు… ఇదంతా ఓ అమ్మాయి చెబుతుంటే, మాత్రం మనసు బాధతో నిండిపోతుంది. బహుశా.. ఈ సీన్ నచ్చి సూర్య ఈ కథ ఒప్పుకుని ఉంటాడు. సమాజంలో ఉన్న పరిస్థితిని, దుస్థితిని చూపించినప్పుడు – దానికి తనదైన శైలిలో పరిష్కారం చెప్పగలగాలి. లేదంటే… సమస్యని ఎత్తుకోవడంలో అర్థం ఉండదు.
సూర్య మాస్ స్టైల్ లో చేసుకుంటూ వెళ్లిపోయాడు. సెకండాఫ్‌లో మాత్రం ఎమోషన్ పండించడానికి ఛాన్స్ దొరికింది. దాన్ని సూర్య వాడుకున్నాడు కూడా. సూర్య అంటే డాన్సులు, ఫైట్లు, కమర్షియల్ హంగులు అనుకునేవారికి మాత్రమే ఈ సినిమా, అందులో సూర్య నచ్చవచ్చు. ప్రియాంక అరుళ్ మోహన్ అందంగా ఉంది. గ్లామరెస్ గా కనిపించింది. సెకండాఫ్‌లో కీలకమైన సీన్లో తన నటన బాగుంది. సత్యరాజ్ లాంటి నటుడ్ని తీసుకుని, ఆ పాత్రని సరిగా వాడుకోలేదనిపిస్తుంది. శరణ్య అలవాటు ప్రకారం ఓవర్ యాక్షన్ చేస్తే… ఈ విషయంలో ఆమె కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివింది వాసుకీ.
పాటల్లో దరువులు ఎక్కువయ్యాయి. అసలు తెలుగు పాటల్లో సాహిత్యం గురించి ఆలోచిస్తున్నారా? అనిపిస్తోంది. డబ్బింగ్ పాటలు రాశారా? లేదంటే గూగుల్ ట్రాన్స్‌లేటర్ లో.. వచ్చిన పదాలనే పాటగా మార్చారా? అనే అనుమానం వేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్లోనే మోతే. ఫొటోగ్రఫీ ఓకే. ఇంట్రవెల్ ఫైట్ ఒకటి.. బాగా మాసీగా ఉంది. దర్శకుడు చాలా రొటీన్ పాయింట్ ని ఎంచుకుని దాన్ని సూర్య ఇమేజ్‌తో మిక్స్ చేద్దామనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నం బెడసికొట్టింది.
తెలుగు360 రేటింగ్ : 2/5