వైసీపీ ఎమ్మెల్సీ హత్య కేసులో అడ్డంగా ఇరుక్కున్నారని క్రైమ్ గురించి తెలిసినా ఏ చిన్న వ్యక్తి అయినా ఇట్టే చెప్పేస్తాడు. కానీ ఏపీ పోలీసులకు మాత్రం అదేమీ అర్థం కాదు. ప్రజలంతా నోళ్లు నొక్కుకుని పోలీసుల నీతి, నిజాయితీలపై అనుమానాలు వ్యక్తం చేస్తూంటే సిగ్గుపడి.. చివరికి సీఎం, డీజీపీ చెప్పారని హత్య కేసుగా మార్చాలని చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు. అదైనా సీరియస్గా చేశారా అంటే అదీ లేదు. చివరికి ఎమ్మెల్సీని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఘనంగా ప్రకటించారు. నిజానికి ఆ ఎమ్మెల్సీ పెళ్లిళ్లకు హాజరవుతున్నారు.
అలాంటిది ప్రత్యేక బృందాలెందుకో ఎస్పీ చెప్పాల్సి ఉంది. మరో వైపు చనిపోయిన సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పోలీసులే హింసిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. హత్య కాదని చెప్పి రాసివ్వాలని.. తెల్ల కాగితంపై సంతకాలు పెట్టాలని పోలీసులు వేధిస్తున్నారని ఆమె ఫోన్ రికార్డింగ్ పంపడం సంచలనం అయింది. ఈ విషయంలో పోలీసులు చెబుతున్న కథలు.. సామాన్యుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎమ్మెల్సీ అనంతబాబు గత రికార్డు ప్రకారం చూసినా ఆయనను తక్షణం అరెస్ట్ చేయాల్సి ఉంది. కానీ బాధితుల కుటుంబసభ్యులు ఆందోళనలు చేస్తే తప్ప పోలీసులు కదల్లేదు. చివరికి వారు ఆయనను అరెస్ట్ చేస్తేనే పోస్ట్ మార్టానికి ఒప్పుకుంటామని ఆందోళన దిగి.. విపక్షాలన్నీ తీవ్రమైన ఆందోళన చేసిన తర్వాతనే కేసును హత్య కేసుగా మారుస్తున్నట్లుగా ప్రకటించారు.
ఆ తర్వాతైనా అరెస్ట్ చేశారా అంటే అదీ లేదు. అదుపులోకి తీసుకుంటామని చెప్పుకొస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం… ఇతర పార్టీల నేతలపై సోషల్ మీడియా పోస్టుల పేరుతోనే అరెస్టులు చేసిన పోలీసులు ఇప్పుడు ఏ పారామీటర్స్ ప్రకారం చూసినా హత్య కేసు నమోదు చేయాల్సిన విషయంలో మాత్రం వైసీపీ ఎమ్మెల్సీ అన్న కారణంగా లైట్ తీసుకుంటున్నారు. మొత్తం పోలీసు వ్యవస్థ పనితీరుపైనే ప్రజల్లో నెగెటివ్ ముద్ర పడేలా చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.