హైదరాబాద్: రాజమండ్రిలో పుష్కరఘాట్వద్ద నిన్న జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకుగానూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధినేత జగన్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇవాళకూడా ముఖ్యమంత్రిపై విమర్శలదాడిని కొనసాగించారు. పుష్కర ఘాట్లో సీఎం పబ్లిసిటీకోసం రెండున్నర గంటలపాటు స్నానం చేశారని జగన్, డాక్యుమెంటరీ షూటింగ్ కోసమే అంతసేపున్నారని రఘువీరా దుమ్మెత్తిపోశారు. అయితే సీపీఐ సీనియర్ నేత నారాయణమాత్రం చంద్రబాబు రాజీనామా చేయాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారు. ఏర్పాట్లలో లోపాలను విమర్శిస్తూనే, ఈ విషయాన్ని రాజకీయంచేయటం తగదన్నారు. తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. లక్షలమందిని ఆహ్వానించిన ప్రభుత్వం మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. వసతులు కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎమ్ పాలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. మరోవైపు ఇద్దరు స్వామీజీలు చంద్రబాబుకు వత్తాసు పలికారు. ఏర్పాట్ల విషయంలో చంద్రబాబును శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సమర్థించారు. ప్రవచనకర్తలదే తప్పన్నట్లుగా మాట్లాడారు. మరోవైపు హిందూ రక్షణసమితి కన్వీనర్ కమలానంద భారతి స్వామి రాజమండ్రి దుర్ఘటనను ప్రభుత్వ వైఫల్యంగా చూపి రాజకీయకోణంలో విమర్శలు చేయటం, చంద్రబాబునాయుడును లక్ష్యంగా చేసుకోవటం ఏమాత్రం సరికాదని అన్నారు. మానవీయ తప్పిదాలు జరగటం సహజమేనని అన్నారు.