కేసీఆర్ తనతో యాగాలు చేయించుకుంటున్నారని… గర్వమో.. జగన్మోహన్ రెడ్డి…కాళ్ల దగ్గరకు వచ్చి కూర్చుంటున్నారనే.. భావమో కానీ… స్వరూపానంద స్వామి.. మితిమీరిన రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు పెడతానంటూ… వ్యాఖ్యనించి కలకలం రేపారు. తాను చేసిన రాజశ్యామల యాగం వల్లే.. కేసీఆర్ విజయం సాధించారని.. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వాన్ని మార్చడానికి… ఇంకా చెప్పాలంటే.. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి యాగం చేస్తానని ఆయన నేరుగా చెప్పడం కలకలం రేపుతోంది. స్వరూపానంద ప్రకటనపై.. రాజకీయవర్గాల్లో.. ముఖ్యంగా.. టీడీపీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. దీంతో ఆయన ముఖ్యమంత్రిపై కేసు పెడతానని చెప్పలేదని.. టీటీడీలో అక్రమాలపై ప్రభుత్వంపై కేసు పెడతానన్నానని మాట మార్చారు.
రాజకీయాలలో కాషాయ స్వాముల హడావుడి ఎక్కువ అయిపోతోంది అధికారంలో ఉన్న వారు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేయకపోతే… వారిని ఓడించడానికి రాజశ్యామల యాగాలు చేసే స్థాయికి స్వాములు ఎదిగిపోయారు. ఏ హోదా లేని తమకు ప్రభుత్వం రాచమర్యాదలు చేయాలని స్వాములు కోరుకుంటున్నారు. స్వాములు, పీఠాధిపతులు… తెలుగు రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ క్రియాశీలకంగా లేరు. సర్వం పరిత్యాగం చేసి కాషాయం ధరించి.. ధర్మప్రచారం చేసే స్వాములు చాలా మంది ఉన్నప్పటికీ.. వారి నోట వెంట ఎప్పుడూ రాజకీయం రాలేదు. ఈ స్వాములను, పీఠాధిపతులను విశ్వసించే రాజకీయ నేతలు ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా… ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. అంత వరకే పరిమితం. కానీ.. గత నాలుగేళ్ల కాలంలో ఈ పరిస్థితి మారిపోయింది. స్వాములు, పీఠాధిపతులు… రాజకీయాల్లోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ పోరాటాలు, ప్రకటనలు చేస్తున్నారు. ఇదే చర్చనీయాంశమవుతోంది..
కొంత మంది స్వాములు.. రాజకీయ ప్రకటనల విషయంలో మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కొంత మంది నేతలు… వారితో యాగాలు చేయించుకుంటూడటంతో.. తమ మాటకు ఎదురు లేదన్నట్లుగా వారి తీరు ఉంది. ఫలనా అధికార కేంద్రం సాష్టాంగ ప్రమాణం చేస్తోంది కాబట్టి… అందరూ చేయాలన్నట్లుగా ఆ స్వాముల తీరు ఉంది. చేయని పెద్దలపై.. అవినీతి ఆరోపణలు చేసి.. కేసులు పెట్టేస్తామని బెదిరించే వరకూ.. ఈ స్వాములు వెళ్లిపోతున్నారు. కొంత మంది నేరుగా పార్టీల్లో చేరి రాజకీయ భవిష్యత్ ను కూడా వెదుక్కుంటున్నారు. స్వరూపానంద.. మొదటి నుంచి రాజకీయ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కోణంలో ఆయనను కేసీఆర్, జగన్ అమితంగా గౌరవిస్తున్నారు. ఆ విధంగా చంద్రబాబు గౌరవించడం లేదని ఆయన… స్వామిజీల మొదటి లక్షణమైన.. ఈర్ష్యాద్వేషాలను.. తిరిగి తెచ్చుకుని .. నిందలు మోపడానికి వెనుకాడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.