ఒకటి మాత్రం క్లియర్. సైరా టార్గెట్… బాహుబలిని మించిన హైప్! బాహుబలి గురించి జనం ఎలా మాట్లాడుకొన్నారో, ఇప్పుడు సైరా గురించి కూడా అలానే మాట్లాడుకోవాలి. అందుకే చిత్ర బృందం అంతా హైప్ ని పెంచడం ఎలా అనే ఆలోచనలో పడిపోయింది. అందులో భాగంగానే బడ్జెట్ అంకెల్ని పెంచేస్తోందిప్పుడు. ఈ సినిమా ప్రారంభానికి ముందు సైరా బడ్జెట్ రూ.100 కోట్లని ప్రచారం జరిగింది. ఆ తరవాత రూ.150 కోట్లన్నారు. ఇప్పుడు ఏకంగా రూ.200 కోట్లకి పెంచేశారు. సురేందర్ రెడ్డి నోటి నుంచే ఈ అంకె వచ్చింది. సైరా లొకేషన్ వేటలో భాగంగా దర్శకుడు సురేందర్ రెడ్డి రాయలసీమ పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఈ సందర్భంగా అక్కడి మీడియా తో మాట్లాడుతున్నప్పుడు సైరా బడ్జెట్ ప్రస్తావన వచ్చింది. బాహుబలి తరవాత తెలుగులో అంత స్థాయి బడ్జెట్‌తో తెరకెక్కే చిత్రం ఇది. అలా మాట్లాడుకోవాలనే చిత్రబృందం ముందే బడ్జెట్ లెక్కల్ని ప్రకటించేసింది. సాధారణంగా సినిమా మొత్తం పూర్తయినా బడ్జెట్ గురించి చెప్పడానికి చిత్రబృందం నిరాకరిస్తుంటుంది. ఐటీ వాళ్లతో తలపోటు ఎందుకన్నది వాళ్ల పాయింట్. అయితే సైరా ఇంకా సెట్‌పైకి వెళ్లలేదు. అప్పుడే బడ్జెట్ బిల్డప్పులు మొదలైపోయాయి.
అమితాబ్ బచ్చన్‌ని తీసుకురావడం, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సందీప్… ఇలా భీకరమైన బ్యాక్ అప్, రెహమాన్ లాంటి టెక్నీషియన్ టీమ్‌లో ఉండడం ఇదంతా…. హైప్ కోసమే. ఇప్పుడు దానికి బడ్జెట్ హంగామా తోడైంది. సినిమా పూర్తయ్యేసరికి ఇంకెంత చెబుతారో…!