చిరంజీవి పుట్టిన రోజున `సైరా నరసింహారెడ్డి` లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకూ రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. కెమెరామెన్ బయటకు వెళ్లిపోవడం, సెట్ వర్క్ ఆలస్యం అవ్వడంతో… సైరా షూటింగ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. చివరికి రత్నవేలుని కెమెరామెన్‌గా ఎంచుకోవడంతో ఆ ఖాళీ పూర్తయింది. అయితే.. రత్నవేలు `రంగస్థలం`తో బిజీగా ఉండడంతో ఇక ఆ సినిమా పూర్తయ్యేంత వరకూ `సైరా` మొదలయ్యే ఛాన్సు లేదనుకొన్నారు. అయితే… `సైరా` యూనిట్ మాత్రం వేరే ఆలోచనల్లో ఉంది. డిసెంబరులో పది రోజుల షెడ్యూల్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. `రంగ స్థలం` షూటింగ్‌కి కాస్త విరామం ఇచ్చి, ఆ సమయంలో `సైరా`ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చిత్రబృందం భావిస్తోంది. అంటే.. డిసెంబరులో `సైరా` సైరన్ మోగడం ఖాయమైపోతోంది. 2018 దసరాకి గానీ, 2019 సంక్రాంతికిగానీ `సైరా` విడుదలయ్యే ఛాన్సుంది. దాదాపుగా 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే చిత్రమిది. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మరో కథానాయికగా అనుష్క ఎంట్రీ దాదాపుగా ఖాయం అని సమాచారం.