తెలంగాణ బీజేపీ అప్పుడప్పుడూ రియాలిటీ చెక్ చేసుకుంటోంది. పార్టీ వ్యవహారాలను చూసుకునే బీఎల్ సంతోష్ హైదరాబాద్కు వచ్చి పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. మిషన్ 90 అనే టార్గెట్ వారికి ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ పరిస్థితిపై సమీక్ష చేస్తే.. అసలు 90 నియోజకవర్గాల్లో.,. కనీసం 30 చోట్ల కూడా బలమైన అభ్యర్థులు లేనట్లుగా తేలింది. దీంతో చేరిక కమిటీకి ఆయన కొత్త దిశానిర్దేశం చేశారు. ఇతర పార్టీల్లో నియోజకవర్గ స్థాయిలో పట్టు ఉన్న నేతల్ని ఆకర్షించాలని స్పష్టం చేశారు.
దీంతో ఇతర పార్టీల్లోని సీనియర్ నేతలను ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు. 45 నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికి బీజేపీలో చేరేందుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో సీనియర్ నేతలకు టిక్కెట్లపై భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చి సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఈ మేరకు చేరికల కమిటీకి సందేశం ఇచ్చారు. పార్టీలో చేరుతామని వచ్చే వారికి.. టిక్కెట్ హామీ ఇద్దామని.. ఈ విషయాన్ని పార్టీ అగ్రనేతలతోనే చెప్పిద్దామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అసంతృప్తి ఎక్కువగా ఉంది. సీనియర్లు నేతలు పార్టీని ధిక్కరిస్తున్నారు. ఈ కారణంగా అలాంటి నేతల్లో నియోజకవర్గాల్లో పట్టు ఉన్న నేతలను ఆకర్షించాలని అనుకుంటున్నట్లుగా తెలు్సతోంది. మిషన్ 90లో సక్సెస్ సాధించాలంటే.. ఖచ్చితంగా వలసలు అవసరం అని బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు వస్తే టిక్కెట్ హామీ ఇస్తామని చెబుతున్నారు. ఎంత మంది వస్తారో కానీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం అప్రమత్తమయ్యారు. సీనియర్ నేతలు పార్టీ వీడకుండా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ప్రారంభించారు.